అదొక్కటి మినహాయిస్తే... తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు
గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గడంతో కేసుల సంఖ్య కూడా అదేస్థాయిలో తక్కువగా నమోదయ్యింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 30,210మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,021మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడినవారి మొత్తం సంఖ్య 2,13,084కి చేరింది. మొత్తం టెస్టుల సంఖ్య 35,7,261కి చేరింది.
ఇక ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడినవారిలో ఆదివారం ఒక్కరోజే 2,214మంది కోలుకున్నారు. ఈ రికవరీలతో మొత్తంగా ఇప్పటివరకు ఈ వైరస్ నుండి సురక్షితంగా బయటపడ్డవారి సంఖ్య 1,87,342కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 87.91శాతంగా వుంటే ఇది దేశంలో 86.2శాతంగా వుంది.
read more తెలంగాణలో కరోనా అప్ డేట్... తాజాగా 1717కేసులు నమోదు
కరోనా మరణాల విషయానికి వస్తే గత 24గంటల్లో కేవలం ఆరుగురు మాత్రమే మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 1228కి చేరింది. మరణాల రేటు రాష్ట్రంలో 0.57శాతంగా వుంటే ఇది దేశంలో 1.5శాతంగా వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 24,514 మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
జిల్లాల వారిగా చూసుకుంటే జీహెచ్ఎంసీ(హైదరాబాద్) పరిధిలో అత్యధికంగా 228 కేసులు బయటపడ్డాయి. ఖమ్మం 67, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 కేసులు మాత్రమే నమోదవగా మిగతా జిల్లాలో కేసుల సంఖ్య తక్కువగా వుంది.