హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో(ఆదివారం రాత్రి 8 గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 34,431మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 301మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,90,309కు చేరితే టెస్టుల సంఖ్య 73,12,452కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 293 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,84,217కి చేరింది.  దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 4,524 మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,459గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1568కి చేరింది. ఇటీవల రాష్ట్రంలో కేసులే కాదు మరణాలు కూడా అతి తక్కువగా నమోదవుతున్నాయి.