అమ్ముడుపోయారంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీఎన్జీవో నేతలు, రేపు నిరసనలకు పిలుపు
తమపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు టీఎన్జీవో నేతలు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. టీఎన్జీవో నేతలు అమ్ముడుపోయారని, ప్రమోషన్ల కోసం, పైరవీల కోసం టీఆర్ఎస్‌కు మద్ధతిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
టీఎన్జీవో నేతలు అమ్ముడుపోయారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రమోషన్ల కోసం, పైరవీల కోసం టీఆర్ఎస్‌కు మద్ధతిస్తున్నారని.. 317 జీవో పేరుతో చెట్టుకొకకరు, పుట్టకొకర్ని చేసినందుకా అని ఆయన ప్రశ్నించారు. టీఎన్జీవో నాయకులపై కేసులు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఎన్జీవో నేతలు మండిపడ్డారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
అంతకుముందు ఆదివారంనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో మీడియాతో మాట్లాడారు. నిన్న హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ప్రస్తావించే వరకు ఈ జీవో 51 జారీ చేసిన విషయమై తెలియదన్నారు. జీవో జారీ చేసిన వెంటనే ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
Also REad:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలతో రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ:కేసీఆర్ పై బండి సంజయ్
మొయినాబాద్ పాం హౌస్ విషయమై తమ పార్టీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల ప్రలోభాల అంశంపై తమకు సంబంధం లేదని బండి సంజయ్ ప్రకటించారు. అందుకే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విసయాన్ని ఆయన గుర్తు చేశారు.యాదాద్రి ఆలయంలో ప్రమాణానికి రావాలని తాను చేసిన సవాల్ కు కేసీఆర్ స్పందించలేదన్నారు.అయినా కూడా తాను ఆలయంలో ప్రమాణం చేసిన విషయాన్ని సంజయ్ ప్రస్తావించారు. తప్పు చేయకపోతే విచారణను కేసీఆర్ ఎందుకు వద్దంటున్నాడని బండి సంజయ్ కోరారు.
మొయినాబాద్ ఫాం హౌస్ ఘటన జరిగిన రోజు నుండి నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు రాకుండా అడ్డుకున్నారో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. రోహిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకొనే సమయంలో ఎన్ని కోట్లు ఇచ్చావో మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని అడిగితే చెబుతాడన్నారు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఎంతిచ్చారో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడిగితే చెబుతారని బండి సంజయ్ తెలిపారు.2014 నుండి ఇప్పటివరకు 36మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారని బండి సంజయ్ చెప్పారు.తమ పార్టీలో చేరాలంటే ముందుగా తామున్న పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయాలని బండి సంజయ్ చెప్పారు.