ఎన్నికలకు సరిగ్గా వారం ముందు తెలంగాణ జన సమితి పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, ప్రముఖ న్యాయవాది రచనా రెడ్డి రాజీనామా చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ...కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు.

ఆయన మైనార్టీలకు ఒక్క టికెట్ ఇవ్వలేదని ఇక ఏ విధంగా వారికి న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు. కోదండరామ్ కాంగ్రెస్‌తో కలిసి తనకు తానే ఓటమి చెందుతున్నారని.. అసలు కూటమి గెలవడానికా లేక ఓడిపోవడానికా అని రచన ప్రశ్నించారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదన్నారు.. మహాకూటమి కూర్పు సరిగా లేదని.. దానిలోని నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్యారాచూట్ అభ్యర్ధులకు టికెట్లు ఇచ్చిందని.. వంకాయలు, వీరకాయలు అమ్ముకున్నట్లు కూటమిలో టికెట్లు అమ్ముకున్నారని రచనా ఆరోపించారు.

తాము పార్టీలో చేరే వరకు కోదండరామ్ వెంటపడ్డారని.. ఆ తర్వాత పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకుని వచ్చిన వారిని కోదండరామ్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నాగిరెడ్డి పేటకు చెందని రచనా రెడ్డి పుణే, అమెరికాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.

అమెరికాలోని ల్యూసెక్టర్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మానవ హక్కుల అంశంపై పీహెచ్‌డీ పట్టా పొందారు. అక్కడ మూడేళ్ల పాటు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఆమె భారత్‌కు తిరిగి వచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత  ప్రొ.కోదండరామ్ కోరిక మేరకు తెలంగాణ జన సమితిలో చేరారు.