తెలంగాణలో కాబోయే సర్పంచ్ లు ఏం చేయాలె? ఏం చెయ్యొద్దు? చదవండి

TJS issues instructions for Sarpanches
Highlights

ఇవన్ని ఫాలో కావాలె

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోలాహలం జోరందుకుంది. యూత్ నుంచి మొదలుకొని మిడిల్ ఏజ్ వాళ్లు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తెలంగాణ జన సమితి సర్పంచ్ గా పోటీ చేసేవారు దరఖాస్తు చేసుకోండి అని ప్రకటనలు ఇస్తే పెద్ద సంఖ్యలో యూత్ ముందుకొచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ తరుణంలో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునేవారు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఐదేళ్లపాటు ఎలా ఉండాలో తెలుపుతూ తెలంగాణ జన సమితి నాయకుడు నాగార్జున ఒక పోస్టును సోషల్ మీడియాలో సర్కులేషన్ లో పెట్టారు. ఆ పోస్టు కింద యదాతదంగా ప్రచురిస్తున్నాం. చదవండి.

 

గ్రామ_పంచాయతీలకు తర్వాత కాబోయే #సర్పంచ్ లు ఎలా ఉండాలి‌? 

(దయచేసి పూర్తిగా చదవండి)

1) కనీసం 5 నుండి 10వ తరగతి దాక అయినా చదువుకుని ఉండాలి.

2) తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి.

3) గ్రామ పంచాయతీ పరిపాలన ఏవిధంగా చేయాలో అవగాహన కలిగి ఉండాలి.

4) ప్రతీరోజూ గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని  పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.

5) పంచాయతీరాజ్ తనకు అప్పగించిన సర్పంచ్ విధులను మరియు పంచాయతీ విధులను సక్రమంగా నిర్వర్తించువాడై ఉండాలి.అన్నీ రకాల పంచాయతీ రికార్డులను నిర్వహించే విధంగా కార్యదర్శి బాధ్యత తీసుకునే విధంగా పని చేయించాలి. అప్పడప్పుడు సర్పంచే ఆ రికార్డులను పరిశీలించాలి.

పంచాయతీ కార్యాలయాన్ని దురుపయోగం , నిరుపయోగం కాకుండా , ప్రభుత్వ సంబంధిత అన్నీ పనులకు , చర్చలు , సభలు , సమావేశాలకు వాడుకోవాలి.

6) సంవత్సరానికి రెండు సార్లు తప్పకుండా గ్రామసభను నిర్వహిస్తూ ఆ సంవత్సరం గ్రామ పంచాయతీకి విడుదలైన నిధులు,గ్రాంటుల యొక్క వివరాలను ప్రజలకు తెలియపరచి వాటిని వినియోగించవలసిన పద్ధతులను వార్డు సభ్యులు మరియు ప్రజల ద్వారానే తెలుసుకుని ఆ రకంగానే కార్యదర్శి చేత అమలు చేయించాలి. అంతేకానీ సర్పంచ్ మరియు కార్యదర్శి ఇద్దరూ కలిసి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

7) పంచాయతీ నిధులను దుర్వినియోగ పరచకుండా మరియు సొంత పనులకు మరియు ఖర్చులకు వాడుకోకుండా ఏ పనికోసం కేటాయించిన నిధులను ఆ పనికోసమే వినియోగించాలి.

8) ఎవరికి వరించిన సేవాభాగ్యాన్ని వారే వినియోగించుకోవాలి, అనగా భార్య సర్పంచ్ గా ఉంటే భర్తలు అధికారం చెలాయించకూడదు. స్వయంప్రపత్తితో పరిపాలన సాగించాలి.

9) ప్రతీరోజు నిర్ణీత సమయంలో పంచాయతీ కార్యాలయంలో కూర్చొని తన విధులతో పాటు పంచాయతీ సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలి.

10) పంచాయతీ కార్యదర్శి ఎల్లప్పడూ పంచాయతీ పరిధిలోనే పని చేసే విధంగా సర్పంచ్ ఆదేశాలివ్వాలి.

11) తాను ఒక నాయకుడిని అనే గర్వం లేకుండా , ప్రజా సేవకున్ని అనే భావంతో పని చేయాలి.ఎవరిపైనా అధికారం చెలాయించకూడదు.

12) గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కుల,మత,జాతి,లింగ బేధాలు లేకుండా , తన సొంత బంధువులు కదా అనే భావన కలగకుండా అందరికీ సమానంగా , ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందేలా చూడాలి.

13) నేను సర్పంచ్ కదా , ఏమైనా చేయవచ్చు . నేను పంచాయతీ నిధులను కాజేసినా ఎవరికీ తెలియదు. తెలిసినా ఎవ్వరూ ప్రశ్నించరు అనే మూఢ నమ్మకాన్ని వదిలేసి, ప్రజలు గుడ్డివారు కాదు, గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినా సమాచార హక్కు తో తెలుసుకుని అవినీతి జరిగితే ప్రశ్నిస్తారు , అవసరమైతే మనల్ని పదవి నుండి ఊడగొడతారు అనే ముందు ఆలోచన కలిగి ఉండాలి.

14) గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలకు , సభలు , సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ - ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, ప్రతి పథకాన్ని వారు సక్రమంగా అందుకునే పరిజ్ఞానాన్ని కల్పించాలి.

15) పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన పట్ల విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుని , అప్పుడప్పుడు పిల్లలను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వారి ప్రతిభను పరీక్షించాలి. వారికి పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నా వారి ద్వారానే తెలుసుకుని వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజన విషయంలో ఆహర భద్రతను దృష్టితో ఉంచుకుని వారికి నాణ్యమైన ఆహార పానీయాదులను అందేలా చూడాలి.ప్రతీ విద్యార్థి పాఠశాలకు సరిగ్గా హాజరవుతున్నాడా ? లేదా అని ఉపాధ్యాయులను అడుగుతూ , బడి వదిలిన లేదా సరిగా హాజరు కాని పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాలు చేపట్టాలి.అక్షరాస్యతను పెంచే దిశగా పనిచేయాలి.

16) ప్రజల చేతనే ఎన్నుకోబడిన వార్డు సభ్యులను గౌరవిస్తూ , రాజ్యాంగం వారికి కల్పించిన విధులు, బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహించుకునే వెసలుబాటు కల్పించాలి. అలా కాకుండా వార్డు సభ్యులను పక్కన పెట్టి పరిపాలన సాగించకూడదు. వారి స్థానాన్ని వారు సక్రమంగా వినియోగించుకొనెలా అవకాశం ఇవ్వాలి. వార్డు సభ్యుల నిర్ణయాల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులు జరిపించాలి.

17) సర్పంచ్ అయినది ప్రజల సేవకే కానీ , ప్రజల ధనాన్ని కాజేయడానికి కాదు , దేశ అభివృద్ధి లక్ష్యంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికే ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు కానీ , అభివృద్ధి పనులకు కేటాయించబడిన నిధులను తన అభివృద్ధి కోసం వాడుకోకూడదని తెలిసి పని చేసేవాడై ఉండాలి.

18) సర్పంచ్ గా తాను గ్రామానికి అందిస్తున్న సేవలకు గానూ , ప్రభుత్వం ఇస్తున్న గౌరవభృతి(జీతం)ని తప్పా , మిగతా ఊరికి చెందిన సొమ్ములో 1రుపాయికి కూడా తీసుకునే హక్కు తనకు లేదని తెలిసి , డబ్బు ఆశించకుండా నిశ్వార్థంగా పని చేయువాడై ఉండాలి.

19) తాను పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే తపన కలిగి, తన గ్రామాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ , ఆదర్శ గ్రామ పంచాయతీ గా తీర్చిదిద్దే యోచన కలిగిన వాడై ఉండాలి.

20) అంత లేకపోయినా పంచాయతీరాజ్ శాఖ అప్పగించిన విధులను ,బాధ్యతలను 100/100 శాతం సక్రమంగా నిర్వహించాలి అనే మంచి తత్వంతో పని చేసినా చాలు.

పై విధంగా ఒక సర్పంచ్ అయిన తర్వాత ఒక ప్రజా సేవకుడిగా పని చేస్తూ , ప్రజలు తనకు అప్పగించిన 5 ఏళ్ల పదవీ కాలాన్ని సద్వినియోగ పరచుకోవాలని , ఇలాంటి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఎప్పటికీ రాదని , దేవుడిచ్చిన వరమని భావించి పరిపాలించే గొప్ప నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి మన గ్రామాలకు సర్పంచ్ లుగా ఎన్నికవ్వాలని కోరుకుందాము.

(పై లక్షణాలు ఏమీ లేకుండా , కనీసం నాయకత్వ లక్షణాలు కూడా లేకుండా రాజ్యాంగ ధర్మాలకు అనుగుణంగా నడుచుకోలేని ,పరిపాలన దక్షత లేని , అక్షర జ్ఞానం లేని , నీతి నిజాయితీ పాటించని , అవినీతిపరులు మరియు ఊరి సొమ్మును దోచేసి ఆస్థులు సంపాదించి, మేడలు కట్టించుకోవాలనే పగటి కలలు కనే మహానుభావులు మన గ్రామాలకు సర్పంచులు కాకూడదని , వారి వల్ల దేశ భవిష్యత్తు నాశనం కాకూడదని  కోరుకుంటూ...

 

మీ..నాగార్జున          తెలంగాణ జన సమితి

http://www.telanganajanasamithiparty.org/sarpanch

loader