తెలంగాణ జన సమితి పార్టీ అధినేత కోదండరాం డిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ది పనులను కోదండరాం తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. 

ఈ సందర్భంగా మెట్రోపాలిటిన్ సిటీ డిల్లీలోని బస్తీల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ''ఆమ్ ఆద్మీ  మొహల్లా క్లినిక్'' లను కోదండరాం పరిశీలించారు.  అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు.  ఈ క్లినిక్ ల ద్వారా పేద ప్రజలకు డిల్లీ ప్రభుత్వం ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ప్రజల చెంతకే డాక్టర్లు వచ్చి వైద్యాన్ని అందిస్తున్న తీరు తెన్నుల కోదండరాం స్వయంగా పరిశీలించారు. అక్కడ పేదలకోసం ఉపయోగిస్తున్న మెడికల్ సామాగ్రి, మందులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కోదండరాం కేజ్రీవాల్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యులకు, పేదలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతూ సీఎం కేజ్రీవాల్ డిల్లీ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాడని కొనియాడారు.