పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు టీ జేఏసీ ప్రకటించింది. వారిని సస్పెండ్ చేయడానికి గల కారణాలను కూడా పేర్కొంది.
నిరుద్యోగ నిరసన ర్యాలీ తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీలో విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీ జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్... కోదండరాం లక్ష్యంగా టీ జేఏసీపై విరుచకపడుతూనే ఉన్నారు.
ఇప్పటికే కోదండరాంను ఉద్దేశిస్తూ రెండు బహిరంగ లేఖలను విడుదల చేశారు. మరోవైపు టీ జేఏసీని చీల్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న టీ జేఏసీ ఎట్టకేలకు పిట్టల వర్గానికి చెక్ పెట్టింది. పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్ ను సస్పెండ్ చేస్తున్నట్లు టీ జేఏసీ ప్రకటించింది. వారిని సస్పెండ్ చేయడానికి గల కారణాలను కూడా పేర్కొంది.
నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కావడం, జేఏసీ ప్రజల బలమైన గొంతుకగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు తమ కుట్రలను తీవ్రతరం చేశారని అందులో భాగంగానే టీ జేఏసీలో విభేదాలు సృష్టించారని అభిప్రాయపడింది.
‘ ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కొంతమందిని ప్రలోభానికి గురిచేసి, ప్రజలలో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు తిప్పికొట్టాలని జేఏసీ నిర్ణయించింది.
ప్రభుత్వ ప్రలోభాలకు లోబడి కొందరు చేస్తున్న ప్రకటనల వల్ల జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వీటివల్ల జేఏసీ తన కార్యాచరణను మరింత బలంగా ప్రజలలోకి తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడుతున్నది.
ప్రజల సమస్యలు పరిష్కరించే బదులు , ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న శక్తులను అధికార దుర్వినియోగానికి పాల్పడి, అనైతిక పద్ధతుల ద్వారా బలహీన పరచాలనుకోవడం అవివేకం.
ప్రజాస్వామిక విలువల పట్ల కనీస గౌరవమున్న వాళ్ళు చేసేపనికాదు. ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణిని ఖండిస్తున్నాం. ఆ కుట్రలకు చేయూత నిస్తున్న శ్రీ.పిట్టల రవీందర్ గారిని, శ్రీ. నల్లపు ప్రహ్లాద్ గారిని టీజేఏసీ నుండి సస్పెండ్ చేస్తున్నాం.’ అని జేఏసీ ఓ లేఖను విడుదల చేసింది.
