ఇటీవల పంజాబ్ ఘటనను దృష్టిలో వుంచుకుని శనివారం నాటి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీసులు సహా దాదాపు 7,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 

రేపు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగ్యనగరం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. ఇటీవల ‘‘పంజాబ్‌లో భద్రతా లోపం’’ (modi security breach) నేపథ్యంలో పీఎంవో వర్గాలు ముందే అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు మోడీ పర్యటన సాగే ప్రాంతాలైన ముచ్చింతల్, పటాన్ చెరులోని ఇక్రిసాట్ ప్రాంతాల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ రెండు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బృందాలు, రాష్ట్ర పోలీసులు సహా దాదాపు 7,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGAI) సహా రెండు వేదికల వద్దా ఫూల్ ప్రూఫ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

పంజాబ్‌లో రైతుల నిరసన కారణంగా గత నెలలో ఫ్లైఓవర్‌పై ప్రధాని మోడీ కాన్వాయ్ చిక్కుకుపోయినట్లు కాకుండా, హైదరాబాద్‌లో ఆయన పర్యటన సాఫీగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మోదీ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ముందుజాగ్రత్తగా, రెండు వేదికలకు రోడ్డు మార్గాల్లో పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. మోడీ తొలుత శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో దిగిన తర్వాత.. పటాన్‌చెరులో ఉన్న ఇక్రిసాట్ క్యాంపస్‌ను సందర్శించడానికి వెళతారు. ICRISAT 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. తిరిగి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆపై రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌కు రోడ్డు మార్గంలో చినజీయర్ ఆశ్రమంలో (chinna jeeyar swamy ashram) ‘సమతామూర్తి విగ్రహాన్ని’ ఆవిష్కరించనున్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారులు.. తెలంగాణ అధికారులు, రాష్ట్ర పోలీసుల సమన్వయంతో రూట్ మ్యాప్‌లు, ఇతర భద్రతా వివరాలను రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ పరిశీలించారు. వరుసగా రెండో రోజు వివిధ శాఖల అధికారులతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎస్ ఆదేశించారు.

ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలన్నారు. పాస్ హోల్డర్లు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌లకు ముందు RT-PCR పరీక్షలు చేయించుకోనున్నారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని, మోడీ కాన్వాయ్‌ ప్రయాణించే మార్గంలో లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు. వీఐపీల సందర్శనార్థం అన్ని ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సైతం.. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు. 

కాగా...పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 5న భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్‌ పోలీసులకు అందించారు. 

దీనిపై స్పందించిన పంజాబ్ డీజీపీ.. రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని భటిండా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో గానీ 100 మంది రైతులు ఆ రహదారిని దిగ్బంధించారు. దీంతో కారులోనే ప్రధాని కాసేపు వేచిచూశారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ చేరుకున్నారు.