Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాల: గ్రామ శివారులో పులి సంచారం... శ్రీరాంపూర్ లో భయం భయం (వీడియో)

జగిత్యాల జిల్లా సంగెం శ్రీరాంపూర్ గ్రామ శివారు పొలాల్లో పులి సంచరిస్తుండంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

tiger identified in Jagitial district
Author
Jagtial, First Published Sep 1, 2021, 3:26 PM IST

జగిత్యాల: అడవిలో వుండాల్సిన పులి గ్రామ శివారులోని పొలాల్లో కనిపిస్తుండటంతో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్ గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. పులి భయానికి రైతులు పొలానికి వెళ్లడానికి జంకుతున్నారు. గ్రామ శివారులో సంచరిస్తున్న పులి గ్రామంలోకి వచ్చి మారణహోమం సృష్టించకముందే అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని... పులి నుండి తమను రక్షణించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఉంది. దీంతో మండల పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచారం వుందన్న ప్రచారం వుంది. ఈ క్రమంలోనే గత వారం  సంగెం శ్రీరాంపూర్ శివారులో గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పులి కనిపించింది. అతడు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పినా దేన్నో చూసి పులి అనుకుంటున్నాడని ఎవరూ నమ్మలేదు. అయితే గత రెండు రోజులుగా పలువురికి పులి కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళన మొదలయ్యింది.

వీడియో

గ్రామ సరిహద్దుల్లో వున్న దట్టమైన అడవిలోంచి బయటకు వచ్చిన పులి గ్రామ శివారులోని సంచరిస్తుందని స్థానికులు అంటున్నారు. గోదావరి తీరంలో గల పంట చేలలో పులి తిరుగుతుందట. ఇది ఇప్పటికే పలువురు రైతులు, గొర్ల కాపరుల కంట పడిందని గ్రామస్తులు ఆందోళన పడుతున్నారు. ఈ పులి బారిన గ్రామస్తులు, మూగజీవాలు పడకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని శ్రీరాంపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.  

ఇదిలావుంటే వారం రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అటవిశాఖ అధికారులు మాత్రం ఇది జిట్ట పులిగా నిర్ధారించారు. కానీ శ్రీరాంపూర్లో మాత్రం పులిని నేరుగా చూసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పులిని గుర్తించే పనిలో పడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios