Asianet News TeluguAsianet News Telugu

పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత

తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన పిడుగుల ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు రైతులు, ములుగు జిల్లాలో ఒక రైతు మరణించారు. పలు మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. మరి కొందరికి గాయాలు అయ్యాయి. ఈ వాన వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు.

Thunderstorm disaster.. Three dead in Adilabad, one in Mulugu.. After death of many dumb creatures..ISR
Author
First Published Sep 30, 2023, 7:08 AM IST

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం కురిసిన వాన భారీ విషాదాన్నే మిగిలిచ్చాయి. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం వల్ల పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ పిడుగుల వల్లే కాకుండా వర్షం వల్ల సంభవించిన ఇతర ప్రమాదాల్లో ఆదిలాబాద్ జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. 

‘ఈనాడు’ కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గూడ గ్రామానికి చెందిన 38 ఏళ్ల రైతు యాసిం తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. ఎప్పటిలాగే తన భార్య అప్సానాతో కలిసి శుక్రవారం చేనులోకి పనులు చేసేందుకు వెళ్లారు. పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండి కడుతున్నారు. ఈ క్రమంలో ఒక్క సారిగా వారిపై పిడుగుపడింది. దీంతో రైతు యాసిం అక్కడే మరణించారు. అలాగే ఆయన జత ఎడ్లు కూడా మృత్యువాత పడ్డాయి. అప్సానా తీవ్రంగా గాయపడ్డారు.

ఇదే జిల్లాలోని బేల మండలం మశాల(బి) గ్రామానికి చెందిన మాడావి కుశ్వంత్ రావు-సంగీత భార్యాభర్తలు. వీరిద్దరూ పొలం పనులకు శుక్రవారం వెళ్లారు. ఎడ్లబండిపై తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో వారిపై పిడుగుపడింది. దీంతో కుశ్వంత్ రావుకు గాయాలుకాగా.. ఎద్దు మరణించింది. 

అలాగే కుమురం భీం జిల్లాలోనూ 22 ఏళ్ల వివాహిత పిడుగుపాటుకు గురై మరణించారు. భర్త అస్వస్థతకు లోనయ్యారు. వాంకిడి మండలంలోని కెడెగాం గ్రామానికి చెందిన గెడాం టుల్లి, తన భార్య పద్మతో కలిసి పొలం పనులకు వెళ్లారు. వర్షం పడటంతో వారిద్దరూ చెట్టు కిందకి పరిగెత్తారు. అయితే ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో పద్మ అక్కడే చనిపోయారు. టుల్లికి గాయాలు అయ్యాయి.

మంచిర్యాల జిల్లాలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల రావుల రవీందర్ అనే కౌలు రైతులు చేన్లో కలుపు తీస్తున్నారు. అయితే ఆ సమయంలో పిడుగు పడటంతో ఆయన మరణించారు. ములుగు జిల్లాలో 24 ఏళ్ల ఈసం పవన్ కల్యాణ్ అనే రైతు పిడుగు పడటంతో మరణించారు. ఆయన గురువారం రాత్రి మొక్కజొన్న పంటకు కాపాల వెళ్లిన తరువాత వర్షం పడింది. దీంతో ఆయన ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై పిడుగుపడింది. 

కాగా.. ఆదిలాబాద్ జిల్లాలోనే వర్షం వల్ల సంభవించిన వేరు వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. బోథ్ మండలంలోని పొచ్చర గ్రామానికి చెందిన 27 ఏళ్ల కొమ్ము రాము అనే రైతు శుక్రవారం చేన్లోకి వెళ్లారు. పత్తి మొక్కలకు పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈదురుగాలులు వచ్చాయి. దీంతో ఆ చేన్లో ఉన్న కరెంట్ పోల్ పై ఉన్న ఇన్సులేటర్ విరిగిపోయింది. దీని వల్ల కరెంట్ తీగలు రాముపై పడ్డాయి. కరెంట్ షాక్ రావడంతో ఆయన చనిపోయారు. 

అలాగే ఇదే మండలం బాలాపూర్ కు చెందిన ఒకరు వాగులో పడి చనిపోగా.. ఆరుగురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఓ ఆలయానికి ఏడుగురు గ్రామస్తులు ఎడ్లబండిపై వెళ్లారు. తిరిగి వస్తుండగా వాన వల్ల ఎడ్లు జారి వాగులో పడిపోయాయి. దీంతో వారంతా వాగు ప్రవాహానికి కొట్టుకుపోయారు. స్థానికులు వారిలో ఆరుగురిని రక్షించారు. అయితే 60 ఏళ్ల రావుత్ రుక్మిణీబాయి మాత్రం నీటమునిగి మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios