బాసర: బాసర రైల్వే స్టేషన్ పరాధిలో రన్నింగ్ ట్రైన్ నుండి ముగ్గురు విద్యార్థులు కిందకు దూకిని ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకివెళితే, బాసర ట్రిపుల్ ఐటీ లో చదువుతున్న విద్యార్థులు ఒక ట్రైన్ ఎక్కబోయి మరో ట్రైన్ ఎక్కేసారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ ఇది కాదు అని తెలుసుకున్న విద్యార్థులు అమాంతం ఆ కదులుతున్న రైలు నుంచి కిందకు దూకేశారు. 

ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలవ్వగా, ఒక విద్యార్థికి మాత్రం తలకు బలమైన గాయం అయ్యింది. స్వల్పగాయాలతో బయటపడ్డ విద్యార్థులకు రైల్వే పోలీసులు అక్కడే ప్రథమ చికిత్స అందించగా, తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. 

నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, ఎన్పీటీఈఎల్‌ సర్టిఫికేషన్ కు సంబంధించిన పరీక్ష రాసేందుకు దాదాపు 100 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బాసర రైల్వే స్టేషన్ కి వచ్చారు. వారంతా అజంతా ఎక్ష్ప్రెస్స్ ఎక్కి నిజామాబాద్ వెళ్లాల్సి ఉంది. వీరిలో ముగ్గురు విద్యార్థులు అజంతా ఎక్ష్ప్రెస్స్ బదులు పర్భానీ పాసెంజర్ ఎక్కారు. రైలు కదిలాక అసలు విషయం తెలుసుకొని టెన్షన్ కి లోనయ్యి రైలు నుంచి దూకేశారు. దీనితో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.