కామారెడ్డిలో పాలవాగులో చిక్కుకున్న కారు: ముగ్గురిని కాపాడిన స్థానికులు
కామారెడ్డి జిల్లాలోని పాలవాగులో కారులో చిక్కుకున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు. పాలవాగులో వరద నీటిని అంచనా వేయలేక ముందుకు తీసుకెళ్లడంతో కారు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులుతాడు సహయంతో ముగ్గురిని బయటకు తీశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో పాలవాగుకు వరద పోటెత్తింది.తుమ్మకపల్లి నుండి సోమారం గ్రామానికి ముగ్గురు కారులో వెళ్తున్నారు. అయితే సోమారం గ్రామానికి సమీపంలో పాలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.వాగులో వరద నీటిని అంచనావేయక కారును అలానే ముందుకు తీసుకెళ్లారు.
అయితే వాగులో వరద పోటెత్తడంతో వాగు మధ్యలోకి వెళ్లిన సమయంలో కారు నిలిచిపోయింది. దీంతో కారులోనే ముగ్గురు కేకలు వేశారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారుకు తాడును కట్టి ట్రాక్టర్ సహయంతో కారును బయటకు తీశారు. గంటపాటు కారులోనే ఈ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వాగులో నుండి కారును బయటకు తీయడంతో ముగ్గురు ప్రాణాపాయం నుండి బయటకు వచ్చారు. ఇంకా మరికొంత సమయం దాటితే కారు వాగులో కొట్టుకుపోయి ఉండేది. తమను కాపాడిన స్థానికులకు కారులలోని ముగ్గురు వ్యక్తులు దన్యవాదాలు తెలిపారు.
గతంలో కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాగులు, వంకట్లో కార్లు చిక్కుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో కొందరు మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది జూలై మాసంలో కురిసిన భారీ వర్షాల సమయంలో వరదల కవరేజీకి వెళ్లినసమయంలో వదర నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఎన్టీవీ చానెల్ రిపోర్టర్ మరణించారు.ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ప్రమాదం నుండి రిపోర్టర్ స్నేహితుడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
2020 సెప్టెంబర్ మాసంలో మహబూబాద్ జిల్లాలోని కొత్తగూడ సమీపంలోని గుంజేడు వద్ద వాగులో కారు చిక్కుకుపోయింది.ఈ కారులో ఇద్దరు యువకులున్నారు. రాత్రంతా కారు వాగులోనే చిక్కుకుపోయింది. కారును ఉదయం గుర్తించిన స్థానికులు వాగు నుండి బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్యజిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సంపతికోట వద్ద వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకరు మరణించారు. 2021 ఆగష్టు 30న వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ లో వాగు దాటే క్రమంలో కారులో చిక్కుకుని నవ వధువు, ఆమె సోదరి మరణించింది. వరుడు సహ పలువురు గాయాలతో బయటపడ్డారు.