ఎంపీ పీఏల మంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో తెలంగాణ ఎంపీ పీఏల మంటూ పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు నిందితులు.

టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏల మంటూ వీరు లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని నుంచి రూ.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇల్లు అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు ముగ్గురు నిందితులు.

రూ.లక్షతో సీబీఐకి పట్టుబడ్డారు. రాజీవ్ భట్టాచర్య, సుభాంగి గుప్తా, దుర్గేశ్ కుమార్‌లను అరెస్ట్ చేసింది సీబీఐ. మన్మిత్  సింగ్ లంబా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.

బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం లక్షకు అంగీకరించిన నిందితులు ఎంపీ మాలోత్ కవిత అధికారిక క్వార్టర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సీబీఐ అధికారులు సిద్ధంగా వుండటంతో వలపన్ని వారు పట్టుకున్నారు. దుర్గేశ్ కుమార్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలో తనకు పిఏలు లేరని మాలోతు కవిత స్పష్టం  చేశారు. దుర్గేష్ కుమార్ తన డ్రైవర్ అని, ఇటీవలే అతన్ని నియమించుకుని తన స్టాఫ్ క్వార్టర్ ఇచ్చానని ఆమె చెప్పారు. దుర్గేష్ తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చునని ఆమె అన్నారు.