జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు.

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. వివరాలు.. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై వివరాలు ఆరా తీశారు. 

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను గద్వాల పురపాలికలోని దౌదర్ పల్లి వాసులుగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. పాత బట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే వారు గద్వాల నుంచి కర్ణాటకలోని రాయ్‌చూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదం అనంతరం బొలెరో వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.