Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో మూడు కొత్త కేసులు.. అరెస్టు రంగం సిద్ధం..?

మహ్మద్ ప్రవక్తపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలకు కారణం అయ్యాయి. ఇంకా పలుచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. 

Three more new cases registered against BJP MLA Raja Singh
Author
Hyderabad, First Published Aug 24, 2022, 4:56 PM IST

హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా  వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై తెలంగాణ పోలీసులు బుధవారం మరో మూడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొన‌సాగుతున్న నిరసనల మధ్య హైదరాబాద్‌లోని నాంపల్లి, మలక్‌పేట పోలీస్ స్టేషన్లలో కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. మత ప్రాతిపదికన వ్యక్తుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు ఆయ‌న‌పై కేసులు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 153-A, 188, 295-A, 298, 505(1)(B)(C), 505(2), 506 కింద కేసులు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోని ముస్లింలు ఫిర్యాదుల నమోదుకు ర్యాలీగా పోలీస్ స్టేషన్‌లకు చేరుకుంటున్నారు. రాజా సింగ్‌పై మంగళవారం ఆరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో అతడిని అరెస్టు చేశారు. ఒక కేసులో రాజా సింగ్‌కు మంగళవారం సాయంత్రం సిటీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనిపై నమోదైన ఇతర కేసుల్లో కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

కాగా, అంత‌కుముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ విడుద‌ల చేసిన ఒక వీడియోలో ముస్లింలు, ప్రవక్త ముహమ్మద్‌పై అనేక అవమానకరమైన.. వివాదాస్ప‌ద వ్యాఖ్యలను చేశారు. ఈ క్ర‌మంలోనే సోమవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ సివి ఆనంద్ కార్యాలయం వెలుపల ఆగ్రహించిన యువకులు ఆయ‌న‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇది మంగళవారం కూడా కొనసాగి బెయిల్‌పై విడుదలైన తర్వాత తీవ్రరూపం దాల్చింది. తమ పార్టీ అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తుందని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి  కృష్ణసాగర్‌రావు చెప్పిన‌ట్టు సియాసత్ నివేదించింది. "మాది జాతీయ పార్టీ.. మేము రాజా సింగ్ ప్రకటనలు లేదా ద్వేషపూరిత ప్రసంగాలకు మద్దతు ఇవ్వము" అని అయ‌న పేర్కొన్నారు. 

ఇక రాజా సింగ్ తీరుపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ విధ్వేషాలను రెచ్చగొడుతున్న‌ద‌ని  మంత్రి జగదీశ్ రెడ్డి మండిప‌డ్డారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని ఆరోపించిన ఆయ‌న‌.. ప్ర‌ణాళిక ప్రకారమే బీజేపీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ లక్ష్యాన్ని ఆపలేరని మంత్రి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios