హైదరాబాద్: రాత్రి ఇంట్లో పడుకున్న ముగ్గురు అక్కాచెల్లెల్లు అర్థరాత్రి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే అమ్మాయిలు కనిపించకుండాపోయి 24గంటలు గడుస్తున్నా ఆఛూకీ లభించకపోవడంతో టెన్షన్ నెలకొంది. ముగ్గురు బాలికలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నట్లు సిసి కెమెరాల్లో చిక్కినా ఇప్పటివరకూ వారు ఎక్కడికి ఏమయ్యారో తెలియరాలేదు. దీంతో వనస్థలిపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

మైనర్ బాలికల మిస్సింగ్ కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమ్మగూడకు చెందిన ఓ వ్యక్తి డెయిరీ ఫాంలో పనిచేస్తాడు. అతడు భార్యా, ముగ్గురు కూతుర్లతో కలిసి నవభారత్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే ఈనెల 9వ తేదీన రాత్రి  ఇంట్లో పడుకున్న ముగ్గురు కూతుర్లు తెల్లవారుజామున కనిపించకుండాపోయారు. 

తెల్లవారుజామున 3గంటల సమయంలో లేచిచూడగా కూతుర్లు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వేతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తెల్లారిన తర్వాత తల్లిదండ్రులు కూతుర్ల మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో మిస్సింగ్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికల ఆఛూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

అయితే గతకొంతకాలంగా ఓ యువకుడు తమ పెద్ద కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని... అతడే ముగ్గురు కూతుర్లని కిడ్నాప్ చేసి వుంటాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినట్లు బాలికల తల్లిదండ్రులు తెలిపారు.