సరదాగా ఈత కొట్టడానికి చెరువులో దిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. 

వనపర్తి: ఈత సరదా ముగ్గురు మైనర్ల ప్రాణాలను బలితీసుకుంది. ముగ్గురు స్నేహితులు మంగళవారం సాయంత్రం సరదాగా చెరువులో ఈతకొడుతూ ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందారు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా (wanaparthy) చోటుచేసుకుంది.

వనపర్తి పట్టణంలోని బండార్ నగర్ కు చెందిన మున్నా, అజ్మత్, భరత్ స్నేహితులు. వీరు ముగ్గురూ పదో తరగతి చదువుతున్నారు. అయితే మంగళవారం సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి చేరుకున్న ఈ ముగ్గురూ సరదాగా బయటకు వెళ్లారు. పట్టణ శివారుకు వెళ్లిన వీరు చెరువులో నీటిని చూసి సరదాగా ఈతకొట్టాలని ఆశపడ్డారు. 

అయితే చెరువులో నీరు ఎక్కువగా వుండటంలో ఈతకు దిగిన ఈ ముగ్గురు బాలురు ప్రమాదానికి గురయ్యారు. బాగా లోతులోకి వెళ్లి నీటమునిగి ముగ్గురూ మృత్యువాతపడ్డారు. మత్స్యకారుల ద్వారా యువకుల గల్లంతు విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మత్స్యకారుల సాయంతో గల్లంతయిన యువకుల మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాత్రివరకు ఈ గాలింపు కొనసాగగా అజ్మత్, మున్నా మృతదేహలు లభించారు. చీకటి పడటంతో రాత్రి గాలింపుచర్యలు నిలిపివేసి తిరిగి ఇవాళ(బుధవారం) చేపట్టారు. దీంతో భరత్ మృతదేహం కూడా లభించింది. 

ముగ్గరు యువకుల మృతదేహలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ కాలనీలో కలిసితిరిగే ముగ్గురు బాలురు ఒకేసారి మృతిచెందడంతో బండార్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇక గతేడాది చివర్లో ఇలాగే నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృత్యువాతపడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రవాహ ఉదృతికి నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

అచ్చంపేట మండలంలోని వేద పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు మాదిపాడు సమీపంలో వున్న కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఆరుగురు విద్యార్థులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన హర్షిత్‌ శుక్లా, శుభమ్‌ త్రివేది, అన్షుమన్‌ శుక్లా, శివ శర్మ, నితేష్‌ కుమార్‌ దిక్షిత్‌ ప్రాణాలు కోల్పోయారు.