శివరాత్రి పండగను పురస్కరించుకుని ఆలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరుగివెళుతుండగా ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ ను కోళ్ల వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గరు బాలురు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆలంపూర్ : ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాల్సిన శివరాత్రి పండగపూట కొన్ని కుటుంబాల్లో విషాదం నిండింది. గత రాత్రి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల జరిగిన ప్రమాదాలు రోడ్లను రక్తసిక్తం చేసి చాలామంది ప్రాణాలను బలితీసుకున్నాయి. శనివారం(నిన్న) పట్టిసీమ వద్ద గోదావరి స్నానానికి దిగిన ముగ్గురు, భీమడోలు వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు, బాపట్ల జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా అర్ధరాత్రి జోగులాంబ గద్వాల జిల్లాలో మరో ముగ్గురు బాలురు బైక్ యాక్సిడెంట్ లో మృతిచెందారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు విషాదాన్ని నింపాయి.
తెలంగాణలోని గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మరీ ఘోరం. శివరాత్రి పండగపూట జోగులాంబ ఆలయానికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్న ముగ్గురు బాలురు తిరుగుపయనంలో ప్రమాదానికి గురయ్యారు. అర్ధరాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ ముగ్గురినీ బలితీసుకుని వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటయిన ఆలంపూర్ లో వెలిసిన జోగులాంబను శివరాత్రి పండగ సందర్భంగా దర్శించుకున్నారు మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న సాయి గౌడ్(15), శేఖర్(15), ఇంటర్మీడియట్ విద్యార్థి రఫీ(16) తమ గ్రామం నుండి బైక్ పై జోగులాంబ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం శివరాత్రి జాగరణ చేస్తూ రాత్రి 12 గంటల వరకు ఆలయంలోనే వున్నారు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై ఆలంపూర్ ఆలయం నుండి తిరుగుపయనం అయ్యారు.
Read More పండగపూట విషాదం... బాపట్లలో ఘోర రోడ్డుప్రమాదం... ఐదుగురు దుర్మరణం
అయితే వీరు బైక్ పై వేగంగా వెళుతుండగా ఇటిక్యాల మండలం నుండి ఆలంపూర్ వైపు వెళుతున్న కోళ్ల లోడ్ వ్యాన్ ఢీకొట్టింది. బైరాపురం వద్ద వేగంగా వెళుతున్న వ్యాన్ బైక్ ను ఢీకొనగా ముగ్గురు యువకులు అమాంతం గాల్లోకి ఎగిరి నేలపై పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలై సాయి, రఫీ అక్కడికక్కడే మృతిచెందారు. శేఖర్ మాత్రం కొద్దిసేపు కొనఊపిరితో విలవిలా కొట్టుకోగా సమయానికి వైద్యం అందక మృతిచెందాడు. ఇలా అమ్మవారి దర్శనానికి వెళ్లిన ముగ్గురు బాలురు మృతిచెందారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందినవెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతల వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
