వరంగల్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ వద్ద చెరువు కట్టపై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.

వరంగల్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ వద్ద చెరువు కట్టపై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారికి చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బాధితులు పెళ్లి సామాన్లకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. చెరువు కట్ట చిన్నదిగా ఉండడం, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడినట్టుగా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో తొమ్మిది మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇక, ఉత్తరప్రదేశ్‌ మధుర జిల్లాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మాణ సామాగ్రితో తీసుకెళ్తున్న ట్రక్కును భక్తులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 32 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది యాత్రికులు ఉన్నారు. వీరు మధురలోని గోవర్దన్ నుంచి ఢిల్లీలోని షాహదారాలకు తిరిగివస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన కొందరిని ఆస్పత్రులకు తరలించారు. ఇక, ప్రమాదంలో బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. 

కాసేపటికి అక్కడికి చేరుకన్న పోలీసులు, ఎక్స్‌ప్రెస్‌వే సిబ్బంది.. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. రూరల్ ఎస్పీ Sheesh Chandra ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే మైల్‌స్టోన్ 66 వద్ద ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. లైసెన్స్ ప్లేట్ నంబర్ UP 17AT 1785 ఉన్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టినట్టుగా తెలిపారు. 

ఇక, బస్సులో ఉన్న వారంతా ఢిల్లీలోని షహదారా ప్రాంతానికి చెందినవారు. వీరు బృందావనం, గోవర్ధన్‌ ఆలయాలను సందర్శించేందుకు మంగళవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఉదయం 10 గంటలకే బృందావనానికి చేరుకున్న భక్తులు దర్శనం అనంతరం గోవర్ధన్‌కు వెళ్లారు. బృందావనం, గోవర్ధన్‌లను దర్శించుకున్న భక్తులు యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా తిరిగి ఢిల్లీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.