చాలా సినిమాల్లో కామన్ ఒక్కమ్మాయి కోసం హీరోతోపాటు.. మరి కొందరు కూడా వెంటపడుతుంటారు. ఆ అమ్మాయి నాకంటే నాకు అని కొట్లాడుకుంటూ ఉంటారు. అచ్చం అలాంటి సీన్ ఒకటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఒక్కమ్మాయి కోసం ముగ్గురబ్బాయిలు కొట్లాడుకున్నారు. ఆ కొట్టుకున్న కుర్రాళ్లంతా ఇంటర్ స్టూడెంట్స్ కాగా.. వారిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం. నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో నివసించే పద్దెనిమిదేళ్ల యువకుడు, మరో ఇద్దరు మైనర్లు ఇంటర్‌ చదువుతున్నారు. వీరు స్నేహితులు. అందులో యువకుడి మేనకోడలు కూడా ఇంటర్‌ చదువుతోంది. సదరు యువకుడు ఆమెను చిన్నవయస్సు నుంచే ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పగా, నిరాకరించింది. దీంతో తన ప్రేమ విషయంలో సహకరించాలని ఇద్దరు స్నేహితులను కోరాడు. వారు సరేనన్నారు. అయితే వారు కూడా ఆమెను ప్రేమిస్తున్నారు. 


అందులో ఒకరు ఏకంగా ఆమె సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పెట్టాడు. విషయం తెలిసిన యువకుడు స్నేహితుడిని నిలదీశాడు. మరో స్నేహితుడు కూడా తానూ అదే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. సినిమా ఫక్కీలో వారు బాహాబాహీకి దిగుదామని సవాళ్లు విసురుకున్నారు. అనుకున్నట్లుగానే బుధవారం సాయంత్రం నిమ్స్‌మే గ్రౌండ్‌లో గొడవకు దిగారు. యువకుడు తనతో తెచ్చిన బ్లేడ్‌తో స్నేహితులపై దాడి చేయగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.