గద్వాల: గద్వాల జోగులాంబ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మరణించారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని మానవపాడు మండలం జల్లాపరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్లు మాఫియాకు అధికారపార్టీకి నేతలవిగా స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు తాగి  పెద్ద ఎత్తున మరణించిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి. కల్తీ కల్లుకు అలవాటు పడిన కొందరు ఈ కల్లును తాగక పోతే  మానసిక వ్యాధిగ్రస్తులుగా ప్రవర్తించిన ఘటనలు కూడ ఈ జిల్లాలో చోటు చేసుకొన్నాయి. ఈ తరహ ఘటనలు చోటు చేసుకొన్న సమయంలో అధికారులు హడావుడి చేస్తారు. ఆ తర్వాత  యధావిధిగా  కల్తీకల్లు యధేచ్చగా కొనసాగుతోంది. అయితే కల్తీకల్లు విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తే  ఈ తరహా ఘటనలు పునరావృతం కావనే అభిప్రాయంతో   స్థానికులు ఉన్నారు. కల్తీ కల్లు మాఫియాకు రాజకీయపార్టీల అండ కూడ ఉండడంతో అధికారులు కూడ చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.