నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్ర శివారులోని సమ్మక్క సారక్క హోటల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

గరిడేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో వీరన్న దేవుడి పండగ కోసం తెల్లవారుజామున గ్రామంలో ఊరేగింపుగా పుట్టమట్టి  కోసం వెళ్లారు. పుట్ట మన్ను తీసుకొని తిరిగి  ఊరేగింపుగా వస్తుండగా వారిపైకి  లారీ దూసుకొచ్చింది. 

ఈ ప్రమాదంలో  గ్రామానికి చెందిన మర్రి ఎంకమ్మ, ధనమ్మ చిలుకూరు మండలం బేతవోలు కు చెందిన  మట్టమ్మ అనే ముగ్గురు మహిళలు మరణించారు. గాయపడినవారిని హుటాహుటిన హుజూర్‌ నగర్‌  ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.