హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలో విషాదకరమైన, దిగ్భ్పాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. దాంతో హైదరాబాదులోని మేడ్చెల్ జిల్లా జవహర్ నగర్ లో కలకలం చెలరేగింది. ఒకే చోటు పోలీసులకు మూడు శవాలు కనిపించాయి.

జవహర్ నగర్ లోని డెంటల్ కాలేజీ డింపింగ్ యార్డు వద్ద మర్రిచెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతుల మృతదేహాలు కనిపించాయి. ఆ పక్కనే చెట్టు కింద మరో చిన్నారి మృతదేహం కనిపించింది. 

వారిది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన సెల్ ఫోన్ల ఆధారంగా వారి వివరాలు సేకరిస్తున్నారు.

ఇద్దరు యువతుల వయస్సు కూడా 20, 22 ఏళ్ల మధ్య ఉంటుంది. యువతులను స్థానికులు ఎవరు కూడా గుర్తించడం లేదు. దీంతో వేరే ప్రాంతానికి చెందినవారై ఉండవచ్చునని భావిస్తున్నారు. పోస్టుమార్టంలో వారు ఏ విధంగా చనిపోయారనే విషయం తెలుస్తుంది. మరణించిన ముగ్గురు ఏ ప్రాంతానికి చెందినవారనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.