ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మితిమీరిన వేగంతో వెళ్తూ... ప్రయాణికులు ప్రమాదాలకు గురౌతున్నారు. ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్డు అంటేనే.... డేంజర్ జోన్ గా మారింది. నగరంలో నుంచి వెళ్లాలంటే... ట్రాఫిక్ రద్దీ తట్టుకోలేక చాలా మంది ఔటర్ రింగ్ రోడ్డుని ఆశ్రయిస్తుంటారు. త్వరగా గమ్యస్థానం చేర్చే మార్గమే ఒక్కోసారి.... ప్రాణాలు పోవడానికి మృత్యుమార్గం అవుతోంది.

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దు, సీటు బెల్టు పెట్టుకోండంటూ ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా జనాలు వినిపించుకోవడం లేదు. ట్రాఫిక్ రూల్స్ మార్చి చలానాలు పెంచినా జనాల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరం.

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విస్తరించిన ఓఆర్ఆర్ పై ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో సగటున 80 మంది దాకా మృత్యువాత పడుతున్నారు. ఇందులో ఈ ఏడాది గత నెలలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు గడిచిన మూడు నెలల్లో జరిగిన 31 ప్రమాదాల్లో 14మంది మృతి చెందారు. మరో 32 మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యాయి. రెండేళ్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

గురువారం ఉదయం కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పెద్ద అంబర్ పేట సమీపంలో ఈ ప్రమాదం జరగగా... దంపతులు ఇద్దరూ శుభకార్యానికి వెళ్తూ మృత్యువాతపడ్డారు. ఈ సందర్భంగా కేవలం ఈ ఏడాది ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కొన్ని ప్రమాదాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

2019 జనవరి: కొంగర కలాన్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జనవరి 11న ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా..  మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గంగావతికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరుకు ఆస్పత్రికి వెళ్లి అంబులెన్సులో ఔటర్ రింగ్ రోడ్ గుండా వస్తున్నారు. వీరు కొంగర కలాన్  రావిలాల సమీపంలోకి రాగానే డివైడర్ దాటుకుని వచ్చిన కారు వీరి అంబులెన్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్సులో ఉన్న గంగావతికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వర రావు (60), అయన భార్య సుబ్బలక్ష్మి (55), ఏలూరుకు చెందిన డ్రైవర్ శివ (35) అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ (40), హేమచందర్ (38), తొషిష్ (34), మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన  కారు డ్రైవర్ మనోజ్ (34)కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

2019 ఫిబ్రవరి.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపలున్న ముగ్గురిలో కారు నడుపుతున్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మేడ్చల్ నుంచి పఠాన్‌చెరుకు టీఎస్07 జీఎం 4666 నంబరు గల సెలిరియో కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కారు మియాపూర్ ప్రాంతానికి చెందిన వారిదిగా భావిస్తున్నారు.

 2019 ఏప్రిల్​:  ఔటర్ రింగ్ రోడ్డుపై గత నెలలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కొత్వాల్ గూడ దగ్గర అదుపుతప్పిన కారు ఎదురురుగా వస్తున్న మరో కారుపై పల్టీ కొట్టింది. రెండు కార్లు బలంగా ఢీకొనడంతో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్​కు తరలించారు. నిజాంపేట్ నుండి శంషాబాద్ ఎయిర్‌‌ పోర్ట్ వైపు వెళ్తున్న కారుపై మరోకారు వేగంగా వచ్చి పడడంతో అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టి అటుగా వస్తున్న కారుపై దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు.

2018 నవంబర్​: కీసర సమీపంలో రాంపల్లి- దయార బ్రిడ్జి వద్ద నవంబర్ 13న ఈ ప్రమాదం జరిగింది. దినేశ్‌‌ కుమార్‌‌ అనే వ్యక్తి తన భార్య సాగరిక, మూడు నెలల బాబు రుషీకేశ్‌‌తో కలిసి తన కారులో కీసర వైపు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రెయిలింగ్‌‌ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి కారణం అతి వేగమేనని తెలుస్తోంది.