కోదండరాం కు ఇవాంకా షాక్

కోదండరాం కు ఇవాంకా షాక్

తెలంగాణ జెఎసి తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం కొలువులకై కొట్లాట సభకు అనుమతించలేదు. హోమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి జెఎసి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. జెఎసి కొట్లాట సభ జరిపితే నక్సలైట్లు చొచ్చుకొని వచ్చే ప్రమాదముందన్నారు. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయిని వ్యాఖ్యలపై జెఎసి తీవ్ర స్థాయిలో మండిపడింది. తెలంగాణ ఉద్యమ కాలంలో సీమాంధ్ర పాలకులు వాడిన భాషనే తెలంగాణ హోంమంత్రి నాయిని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొట్లాట సభ మాత్రమే కాకుండా అమరుల స్పూర్తి యాత్రలకు సైతం సర్కారు అడ్డు పుల్లలు వేస్తున్నట్లు ఆరోపనలు గుప్పించింది.

కొట్లాట సభకు సర్కారు అనుమతి నిరాకరించడంతో తెలంగాణ జెఎసి హైకోర్టు తలుపు తట్టింది. అప్పటికే ఒక తేదీని కూడా జెఎసి ప్రకటించింది కూడా. కానీ ఆ తేదీ వరకు కోర్టులో తీర్పు రాకపోవడంతో సభను ఈనెల 30న జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల కారణాలు చూపే ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు. తుదకు సరూర్ నగర్ స్టేడియంలో కొలువులకై కొట్లాట సభకు కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సర్కారు అంగీకరించింది. అయితే తెలంగాణ జెఎసి దీనికోసం భారీగా ఏర్పాట్లు చేసుకుంటోంది. తీవ్ర స్థాయిలో సన్నద్ధమవుతున్నది.

ఈ పరిస్థితుల్లో కొలువులకై కొట్లాట సభకు మరో చిక్కు ముడి వచ్చి పడింది. అదేమంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఆమె పర్యటన ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈనెల 30 కొలువులకై కొట్లాట సభకు తాము అనుమతి ఇవ్వబోమంటూ తెలంగాణ పోలీసులు అంటున్నారు. కొట్లాట సభ విషయమై బుధవారం కోర్టులో వాదనలు జరిగాయి. ఇవాంకా పర్యటన కారణంగా 30వ తేదీన కొట్లాట సభకు హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఇవ్వలేమని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై రేపు కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అయితే ఇవాంకా పర్యటన అనేది కేవలం సాకు మాత్రమేనని తెలంగాణ జెఎసి అభిప్రాయపడుతున్నది. గతం నుంచీ కొలువులకై కొట్లాట సభ జరపకుండా తెలంగాణ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తోంది. అలాంటి కుయుక్తులతోటే మరోసారి జెఎసి కొలువులకై కొట్లాట సభ జరపకుండా ఇవాంకా పర్యటనను అడ్డుపెట్టుకుంటున్నది ఆరోపిస్తోంది.

మొత్తానికి తెలంగాణ జెఎసి కొట్లాట సభకు మరోసారి ఇవాంకా రూపంలో అడ్డంకులు రావడం పట్ల జెఎసి నేతలు ఆందోళనలో ఉండగా సర్కారు పెద్దలు మాత్రం రిలాక్ష్ మూడ్ లో ఉన్నట్లు కనబడుతున్నది. గతంలో తామే అడ్డుకుని జెఎసికి షాక్ ఇస్తే... ఇప్పుడు ఇవాంకా అమెరికా నుంచి వచ్చి జెఎసికి షాక్ ఇచ్చిందని ప్రభుత్వ పెద్దలు సరదాగా చర్చించుకుంటున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos