కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులందరికీ కూడా రైతుబంధు పథకం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాసుపుస్తకాలు వచ్చిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తెలంగాణ రైతుల మన్ననలు పొందిన పథకం రైతుబంధు. ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందజేస్తుంది. ప్రతీ ఏడాది వానాకాలం పంట వేసే ముందు ఒక సారి, యాసంగి లో పంట వేసే ముందు రెండో సారి పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఇలాంటి పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల మరింత మంది రైతులకు లబ్ది చేకూరనుంది.
కొత్తగా పాస్ బుక్ వచ్చిన వారు కూడా అర్హులే..
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం కల్గి ఉన్న రైతులందరూ ఈ రైతు బంధుపథకానికి అర్హులే. 2018 మే 18వ తేదీన ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్విరామంగా అమలు చేస్తున్నది. ఈ ఏడాది కూడా ఈ రైతు బంధు పథకం అమలు కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 14,800 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో మరింత మంది రైతులకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్తగా పట్టదారు పాసు పుస్తకం పొందిన రైతులకు కూడా దీనిని ఇవ్వాలని భావిస్తోంది. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు, లేదా తండ్రి నుంచి లేదా తల్లి నుంచి వారసత్వంగా కుమారులకు సంక్రమించిన భూమికి పట్టాలు తీసుకున్న రైతులకు కూడా దీనిని ఇవ్వాలని అనుకుంటోంది. నిజానికి గత వారం పది రోజుల నుంచి యాసంగి సీజన్ రైతుబంధు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఇప్పుడు కొత్తగా పాసు బుక్ పొందిన వారికి కూడా కలిపి ఇవ్వాలని అనుకోవడం వల్లే ఆలస్యం అయినట్టు తెలుస్తోంది. కొత్తగా పాసు బుక్ పొందిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. స్థానిక ఏఈవోల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్తోంది. అవసరమైన డాక్యుమెంట్లు దీనికి జత చేయాలని కోరింది.
23న వనపర్తికి కేసీఆర్.. సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు
వరి రైతుల కూడా రైతుబంధు..
ఈ యాసంగిలో వరి సాగు చేసే రైతులకు కూడా రైతుబంధు పథకం అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయినా పలువురు వరినే సాగు చేస్తున్నారని వారికి రైతుబంధు నిలిపివేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు సూచించారు. అయితే దీనికి సీఎం కేసీఆర్ సమ్మతించలేదు. తెలంగాణలో ఉన్న ప్రతీ రైతుకు రైతుబంధు అందిస్తామని తెలిపారు. నిన్న మంత్రులు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతుబంధు వరి రైతులకు ఇవ్వబోరని చెప్పే మాటలు నమ్మవద్దని తెలిపారు. అనంతరం దళితబంధు పథకంపై కూడా మాట్లాడారు. దళితబంధు పథకాన్ని విడతల వారీగా తెలంగాణ అంతటా అమలు చేస్తామని చెప్పారు. మొదటగా హుజూరాబాద్ అమలు చేసి మిగితా రాష్ట్రం అంతా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
