తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పేరిట నాలుగేళ్ల కాల వ్యవధితో ఆనర్స్‌ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనుంది. 

తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తున్న విద్యార్థులకు విపరీతమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిగ్రీలో డిగ్రీ కళాశాలల్లో బీటెక్‌ సీఎస్‌ఈ తరహాలో కొత్త బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ విద్యా శాఖ సిద్దమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో ఈ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు అందుబాటులోకి రానుంది.

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పేరిట నాలుగేళ్ల కాల వ్యవధితో ఆనర్స్‌ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలోని 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 11 ఎంపిక చేసిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సును అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 60 సీట్లు అందుబాటులో ఉంటాయి. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి.

ఇక, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్‌ను 70 నుంచి 75 శాతం మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇప్పుడు, విద్యార్ధులు వారి డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ను కాంబినేషన్‌లో కాకుండా.. పూర్తిస్థాయిలో కంప్యూటర్‌ సైన్స్ కొనసాగించవచ్చని నవీన్ మిట్టల్ తెలిపారు. పరిశ్రమ కూడా కంప్యూటర్ సైన్స్‌లో BSc (ఆనర్స్) ఉన్న విద్యార్థుల కోసం కూడా వెతుకుతోందని చెప్పారు. 


ఈ కోర్సు సిలబస్‌, కరిక్యులం అంతా బీటెక్‌ సీఎస్‌ఈ కోర్సుతో సమానంగా ఉండనుంది. బీటెక్‌లో సీట్లు దక్కించుకోలేని వారికి ఇది మంచి అవకాశంగా మారే అవకాశం ఉంది. అయితే కోర్సు మొత్తం నాలుగేళ్లు కాగా.. మూడేండ్ల తర్వాత కోర్సు నుంచి వైదొలిగితే విద్యార్థికి మూడేండ్ల డిగ్రీని అందజేయనున్నారు. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేస్తే అనర్స్‌ డిగ్రీ పట్టా జారీచేస్తారు.