జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాల ప్రతినిధులు... రాజకీయ నాయకుల పనితీరే కాదు జిల్లాల కలెక్టర్ల పనితీరు కూడా ప్రభుత్వాల మీద ఎంతో ప్రభావితం చూపిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కొందరు యువ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా సొంత ప్రాధాన్యతల మీద పనిచేస్తూ ప్రభుత్వానికి, అక్కడి స్థానిక నాయకులకు ఒక విధమైన దూరం పెంచుతున్నారు. దీని వల్ల అక్కడ స్థానికంగా జరిగే అభివృద్ధి పనులపై ఇది ఒక రకమైన ప్రభావితం చూపిస్తుంది.

ఇలాంటి పరిస్థితులు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల పాలన కుంటుపడటమే కాకుండా ప్రభుత్వంపై ప్రజలకు చెడు అభిప్రాయం కలిగే ఆస్కారం కలిగే అవకాశం ఉంది. కానీ వీటన్నింటిని అధిగమిస్తూ రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణలో వారి పనితీరుతో ప్రభుత్వాన్ని, ప్రజలను మెప్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సరైన దిశలో ప్రజలకు చేరువ చేసి వాటి అమలులో ప్రజలకు ఆ ఫలాలను అందజేయటంలో ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు పరిణతి కనబరుస్తున్నారు. వారిలో ఒకరు సిద్ధిపేట్ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి కాగా మరొకరు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. వీరు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వాటి ఫలాలను సరైన దిశలో ప్రజలకు అందేలా కృషి చేస్తున్నారు.


ఇప్పటికే సిద్దిపేట్ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో అమోఘమైన మార్పుని తీసుకొచ్చారు. సీఎం కెసిఆర్ సొంత జిల్లా కావటంతో జిల్లాకు కొంత ప్రాముఖ్యం ఉండటమే సహజమే కానీ జిల్లాలో ప్రభుత్వ ఫలాలు అందరికి సమానంగా అందటానికి లోతైన కృషి అవసరం. దీని పరంగా  కలెక్టర్ వెంట్రామిరెడ్డి విజయం సాధించారనే చెప్పాలి. రైతులకు సబ్సిడీపై వాహనాలు అందించటం కానీ, 24 గంటలు సాగునీరు విషయంలో కానీ, ప్రతి గ్రామంలో పాడి పరిశ్రమ అభివృద్ధి పట్ల కానీ ఇలా ప్రతి అంశంలో చొరవ తీసుకొని ప్రభుత్వ పథకాల ఫలాలను సామాన్యప్రజలకు అందటంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి విశేషమైన కృషి దాగుందనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఇక రంగారెడ్డి కలెక్టర్ విషయానికొస్తే... ఈ మధ్యే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అమయ్ కుమార్ ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కానీ, వాటిని సామాన్య ప్రజలకు చేరువ చేయటంలో కానీ పక్కాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంతకుముందు సూర్యాపేట్ కలెక్టర్ గా పని చేసిన అమయ్ కుమార్ ఆ జిల్లాలో అడవుల విస్తీర్ణ శాతం తక్కువగా ఉండటంతో సరైన ప్రణాళికలతో జిల్లాల్లో చెట్ల పెంపకంపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటు నాటిన చెట్లను ఎలా రక్షించుకోవాలన్న అంశంపై అన్ని వర్గాల ప్రజల్లో ఒక విధమైన చైతన్యాన్ని తీసుకురావటంలో విశేషమైన కృషి చేశారు. దాని వల్ల సూర్యాపేట్ జిల్లాలో పరిస్థితి కొంతమేరకు మెరుగుపడింది. జిల్లా ప్రధాన కేంద్రమైన సూర్యాపేట్ నగరంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లతో నిండిపోయి ఈ తేడా స్పష్టంగా కనబడుతుంది. 

ఈ అధికారి ఇప్పుడే కాదు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా అమయ్ కుమార్ పనిచేశారు. ఆ సమయంలో ఇప్పటి సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మిత సభర్వాల్ అప్పుడు కరీంనగర్ కలెక్టర్ గా పనిచేసేది. వీరిద్దరి పనితనంతో అప్పుడు కరీంనగర్ పట్టణంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ అధికారుల జోడి అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఒక సంచలనం. కరీంనగర్ పట్టణంలో రోడ్ల వెడల్పు వీరిద్దరి చొరవే. దాని వల్లే ఇప్పుడు పట్టణంలో రోడ్లు విస్తారంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కరీంనగర్ ప్రజలు అప్పుడు వీరు చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుంటారు. 

ఇప్పుడు కూడా రంగారెడ్డి కలెక్టర్ గా అమయ్ కుమార్ ప్రభుత్వ పథకాల అమలుకై కొన్ని రకాల వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే జిల్లాలో రెవెన్యూ అంశాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ ఇద్దరు కలెక్టర్ల పనితీరుతో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది.