అనూహ్యమైన పరిణామాల మధ్య టిఆర్ఎస్ పార్టీ తరుపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను టిఆర్ఎస్ అధినేత కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈ రేసులో ఒక్కరి పేరు మాత్రమే ముందునుంచీ తెర మీద కనబడింది. కానీ మిగతా ఇద్దరు అభ్యర్థుల పేర్లు చివరి రోజు వరకు కూడా వెల్లడి కాలేదు. అనూహ్యంగా మిగిలిన ఇద్దరు తెరపైకి వచ్చేశారు.

కేసిఆర్ అంతరంగికుడు, కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడు, కేసిఆర్ కు నమ్మిన బంటు, కేసిఆర్ కు సడ్డకుడి కొడుకు అయిన జోగినపల్లి సంతోష్ కు రాజ్యసభ సీటు వస్తుందని ముందునుంచీ ప్రచారం జరిగింది. పార్టీలో కూడా సంతోష్ విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. సంతోష్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే మిగతా అభ్యర్థులు ఎవరైతారా అన్నది ఎవరూ చెప్పలేకపోయారు. చివరి క్షణం వరకు కూడా కేసిఆర్ గోప్యత పాటించారు. మీడియాలో కూడా చిన్న లీక్ రాకుండా సైలెంట్ ఆపరేషన్ చేశారు. అయితే అభ్యర్థుల ప్రకటనకు కొద్ది గంటల ముందు బడుగుల లింగయ్య యాదవ్ పేరు మీడియాకు లీక్ అయింది. ఆతర్వాత కొన్ని గంటల తర్వాత బండ ప్రకాష్ పేరు కూడా బయటకొచ్చింది. అయితే ఈ పేర్లు ఫైనల్ అయినట్లేనా? ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న ఉత్కంఠ కూడా అటు పార్టీ వర్గాల్లో ఇటు మీడియా వర్గాల్లో నడిచింది. అయితే ఈ మూడు పేర్లను  కేసిఆర్ అధికారికంగా ఎల్పీ సమావేశంలో ప్రకటించారు. దీంతో టిఆర్ఎస్ రాజ్యసభ సీటు ఎవరికి అన్న ఉత్కంఠకు తెర పడింది.

అయితే.. బగుగుల లింగయ్య పేరు ఖరారు చేస్తారని కానీ, బండ ప్రకాష్ పేరును ఫైనల్ చేస్తారని కానీ చివరి వరకు ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా వీరిద్దరూ రేస్ లోకి వచ్చారు. నిజానికి బడుగుల లింగయ్య కంటే ముందే పార్టీలో చేరి టిఆర్ఎస్ లో సేవలందిస్తున్న యాదవులు చాలామందే ఉన్నారు. కానీ వారందరినీ కేసిఆర్ పక్కన పెట్టేసి బడుగుల పేరు ఖరారు చేశారు. ఇక బండ ప్రకాష్ పేరును కూడా ఎవరు అనుకోలేదు. కానీ బండ ప్రకాశ్ పేరు తెర మీదకు రావడంతో టిఆర్ఎస్ వర్గాలు ఆశ్చర్యానికి లోనయ్యాయి. రేపు వీళ్లంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ పెట్టే ఆలోచన చేస్తున్న తరుణంలో అవసరమైతే ఓటింగ్ జరిగితే ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలన్నదానిపైనా కేసిఆర్ ఎల్పీ సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ కు బలం సరిపోయేలా లేనందున, ఎంఐఎం సపోర్ట్ ఇప్పటికే టిఆర్ఎస్ కు ఇచ్చి ఉన్నందున టిఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లు చెబుతున్నారు. 

టిఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.