హైదరాబాద్: సాఫ్ట్ వేర్ శారద కూరగాయల దుకాణంలో దొంగతనం జరిగింది. కరోనా వైరస్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారద దైర్యం వీడలేదు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఫుట్ పాత్ మీద కూరగాయాలు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. 

మంగళవారం రాత్రి ఆమె దుకాణం మూసేసి, మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై ఉంచి కవర్ తో కప్పి ఎప్పటిలాగే ఇంటికి వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి మొత్తం కూరగాయలు మాయమయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని శారద చెప్పారు. 

దాదాపు రూ.5 వేల విలువైన కూరగాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపారు. తన తండ్రి హయాం నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను అక్కడే బండిపై పెట్టి ప్యాక్ చేసి ఇంటికి వెళ్తున్నామని, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చోరీ జరగలేదని ఆమె చెప్పారు. ఈ మేరకు మీడియాలో శుక్రవారం వార్తలు వచ్చాయి.

శారదకు తన వంతు సాయం చేయడానికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం తన ప్రతినిధి ఆమెకు జాప్ ఆఫర్ లెటర్ అందించినట్లు సోనూ సూద్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.