Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ కు బిజెపి కాక పుట్టిస్తున్నదా ?

  • విమోచనం పైనే పార్టీ నేతల ఆశలు
  • రాజనాథ్ ఏం మెసేజ్ ఇస్తాడని టెన్షన్
  • రాష్ట్ర శాఖకు అడ్డంకిగా మారిన కేంద్ర బిజెపి, టిఆర్ఎస్ సంబంధాలు
The unique predicament of telangana bjp

గత కొంతకాలంగా తెలంగాణ బిజెపి సింగిల్ ఎజెండా పెట్టుకుని పనిచేస్తున్నది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటూ పార్టీ యావత్తు ఇదే డిమాండ్ తో హల్ చల్ చేస్తున్నది. గడిచిన మూడేళ్ళ కాలంలో సర్కారును ఎక్స్ పోజ్ చేసే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా చేపట్టలేకపోయింది బిజెపి. అలా చేయలేకపోవడానికి ఆ పార్టీకి సవాలక్ష కారణాలున్నాయి. కానీ తెలంగాణ విమోచనం పేరుతో గట్టిగానే ఆ పార్టీ జనాల్లోకి పోతున్నది. 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న డిమాండ్ తో బిజెపి సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. అధికార టిఆర్ఎస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది బిజెపి. ప్రజా సమస్యల విషయంలో బిజెపి ఇప్పటి వరకు సర్కారుపై వత్తిడి  తెచ్చిన దాఖలాలు లేవు. అందుకే సెంటిమెంట్ తో ముడిపడిన విమోచనం ద్వారా తాను కూడా బలపడాలన్న భావనలో ఉంది.  తెలంగాణ బిజెపి కి పరిస్థితులు ఏనాడూ కలిసొచ్చిన దాఖలాలు లేవు. బహుషా భారతదేశంలో తెలంగాణ బిజెపి కి వచ్చిన సంకట స్థితి ఏ రాష్ట్ర బిజెపి శాఖకు వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీకి కేంద్ర బిజెపికి మధ్య ఉన్న సంబంధాలు తెలంగాణ బిజెపిని గుక్క తిప్పుకోనివ్వడంలేదు. అందుకే ఏ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు సీరియస్ గా చేపట్టలేకపోయింది బిజెపి.

తెలంగాణ సర్కారు వైఫల్యాలపై ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుందామనుకున్న వెంటనే కేంద్రం నుంచి ఏ మంత్రి గానీ, ఏ బిజెపి పాలిత రాష్ట్రాల మంత్రులు కానీ వచ్చి తెలంగాణ సర్కార్ భేష్ అంటూ కితాబులిచ్చిపోతున్నారు. లేదంటే కొన్నిసార్లు కేంద్ర బిజెపిని టిఆర్ఎస్ నెత్తిన పెట్టుకుంటుంది. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భేషరతు మద్దతివ్వడం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కి ఘనంగా సన్మానించడం, జిఎస్టీకి అందరికంటే ముందుగా మద్దతు పలకడం, మహారాష్ట్ర గవర్నర్ గా అయిన వెంటనే విద్యాసాగర్ రావుకు పౌరసన్మానం, దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి రాగానే పౌర సన్మానం... ఇలాంటి కార్యక్రమాల వల్ల తెలంగాణ బిజెపికి చెమటలు పడుతున్నాయి.

సెప్టెంబరు 17వ తేదీన తెలంగాణ విమోచనం జరపాలంటూ గత కొంతకాలంగా ఆ పార్టీ శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నది. ఊరు వాడ తిరుగుతూ తెలంగాణ సర్కారుకు కాక పుట్టిస్తున్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కేసిఆర్ సెప్టెంబరు 17 విషయంలో అనుకూలంగా మాట్లాడిన విషయాలను, తర్వాత మాట తప్పిన వైనాన్ని బాగానే ఎక్స్ పోజ్ చేస్తున్నది. పార్టీ నేతలంతా జనాల్లోకి వచ్చారు. కార్యకర్తలు బాగానే పనిచేస్తున్నారు. జనాల్లో ఒక చర్చను లేవనెత్తడంలో బాగానే సక్సెస్ అయ్యారు. 

మరి ఇదంతా బాగానే ఉన్నా మరో నాలుగు రోజులపాటు ఈ టెంపో ను అలాగే ఉంచినా 17వ తేదీనాడు రాజనాథ్ సింగ్ తెలంగాణ పర్యటనపై ఆ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆరోజు ఆయన ఏం మేసేజ్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కేంద్ర ప్రతినిధులు ఎవరొచ్చినా ఇక్కడి టిఆర్ఎస్ పాలనను ఆకాశానికెత్తి పోయారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య సైతం కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమాటకొస్తే ఒక్క అమిత్ షా మాత్రమే కేసిఆర్ ను కొద్దిగా కార్నర్ చేశారు తప్ప మిగతా వాళ్లు ఆహా ఓహో అని పొగడ్తలతో ముంచెత్తి వెళ్లారు. ఈ తరుణంలో కేంద్ర బిజెపి ఒక్కసారిగా టర్న్ తీసుకుని టిఆర్ఎస్ ను కార్నర్ చేస్తుందా లేకుంటే వచ్చామా... పోయామా అన్నట్లు రాజనాథ్ పర్యటన ఉంటుందా అన్న ఉత్కంఠ తెలంగాణ బిజెపి శ్రేణుల్లో నెలకొంది. 

ఒకవేళ రాజనాథ్ సింగ్ తెలంగాణ విమోచన విషయంలో కీలకమైన ప్రకటనలు చేస్తారా అన్న ఆసక్తి తెలంగాణ జనాల్లో కల్పించడంలో ఇక్కడి బిజెపి శ్రేణులు బాగనే పనిచేశాయి. మరి రాజనాథ్ ఏమేరకు తెలంగాణ జనాలను ఆకట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అదేరోజు తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు బిజెపిలోకి చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 17 తర్వాత తెలంగాణ బిజెపి గాడిలో పడుతుందా? లేక ఎప్పటిలాగే నాలుగు స్తంభాలాటగా మిగిలిపోతుందా అన్నది మరో మూడు రోజుల్లో తేలిపోతుందంటున్నాయి రాజకీయ వర్గాలు.

Follow Us:
Download App:
  • android
  • ios