వృద్దురాలైన కన్న తల్లిని ఇంట్లోంచి గెంటేసాడు ఓ కసాయి కొడుకు. ఈ అమానుష ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

కామారెడ్డి : ఇంటికి పెద్ద కొడుకంటే పెద్దమనసుండాలి... కానీ వీడికి అసలు మనసే లేదు. నవమాసాలు కడుపున మోసి కనిపెంచిన కన్న తల్లి వృద్దాప్యంలో వుండగా ఇంట్లోంచి గెంటేసాడు. ఇలా ఆస్తి కోసం కన్నతల్లితో కొడుకు కర్కషంగా వ్యవహరించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

కామారెడ్డ జిల్లా దోమకొండ మండలం సంఘమేశ్వరం గ్రామానికి చెందిన లచ్చవ్వకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికి పెళ్లిళ్లయి వేర్వేరు ఇళ్లలో భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. పాత ఇంట్లో తల్లి ఒంటరిగా వుండేది. అయితే ఆ ఇంటి విషయంలో ఇద్దరు కొడుకులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఇవాళ పెద్దకొడుకు పెద్ద నర్సయ్య భార్యాబిడ్డలతో తల్లి వుంటున్న ఇంటికి వెళ్లాడు. అందరూ కలిసి వృద్దురాలయిన లచ్చవ్వను బలవంతంగా ఇంట్లోంచి బయటకు లాగిపడేసి తాళం వేసుకున్నారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన లచ్చవ్వ చిన్న కొడుకు చిన్న నర్సయ్య పై దాడి చేసారు. ఇలా కన్నతల్లి, సొంత సోదరుడిని చాలా దారుణంగా వ్యవహరించింది పెద్ద నర్సయ్య కుటుంబం. 

Read More మనవడిని కిడ్నాప్ చేసిన తాత.. మద్యానికి డబ్బులివ్వలేదని దారుణం..

తల్లిని సొంత ఇంట్లోంచి గెంటేసిన పెద్ద కొడుకుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రతికుండగానే తల్లికి నరకం చూపిస్తున్న అతడికి తగిన బుద్ది చెప్పాలని పోలీసులు కోరుతున్నారు. చిన్న నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.