2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లని గెలిచి కేసీఆర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేశారు. చేరికల ద్వారా ఆ లెక్క పార్లమెంట్ ఎన్నికల ముందు 100 మార్కుని చేరింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో కేసీఆర్ దాదాపుగా 16 సీట్లు సాధిస్తారని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా టిఆర్ఎస్ కేవలం 9 సీట్లని మాత్రమే గెలుచుకుంది.

దీనికి గల కారణాలని పరిశీలించుకుంటే ఈ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ ని ముందుకు తీసుకురావడం ద్వారా ఇది కేవలం జాతీయ పార్టీల మధ్య ఎన్నికలు కావు, ప్రాంతీయ పార్టీలే రేపు కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. దానికి అనుగుణంగానే అందరి నేతలని కలసి చేసిన హడావిడి వల్ల మొత్తానికి కేసీఆర్ తన పార్టీని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబెట్టడం లో సఫలీకృతం అయ్యారు.

అయినప్పటికీ కూడా ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే.. మొదటగా వినపడే మాట కేంద్రీకృతమైన అధికారం కేవలం కేసీఆర్, కేటీఆర్ తప్ప వేరెవ్వరూ పెద్దగా కనపడరు. ఇక పోతే రెండవ అంశం సీనియర్లని పక్కన పెట్టడం, మరెవరికి వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. హరీష్ రావు లాంటి ముఖ్య స్తంభాన్ని కేవలం సిద్దిపేటకు పరిమితం చేయడం లాంటి అంశాలు ప్రజలకు రుచించలేదు. 

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కొన్ని చేయలేకపోయిన పనులు చేస్తారని భావించారు. కానీ కేసీఆర్ మాత్రం 16 సీట్లు ఎలా సాధించాలనే పనిలోనే నిమగ్నమయ్యారు తప్ప తాను ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలు అయిన నోటిఫికేషన్ లు, ఉద్యోగుల సమస్యలపై ఏ విధమైన ప్రగతి కనబడకపోవడంతో వారు సైతం గుర్రుగానే ఉన్నారు. దీనికి చక్కటి ఉదాహరణ టీచర్ల MLC స్థానాలు, ఒక విద్యావంతుల MLC స్థానాల్లో టీఆరెస్ లేదా వారు బలపర్చిన అభ్యర్థుల ఓటమి. 

రైతులు సైతం 178 మంది నామినేషన్లు వేయడం ఆ స్థానంలో కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ అయిన కవిత ఓడిపోవడం అది కూడా ఉత్తర తెలంగాణాలో ఈ ఘటన చోటు చేసుకోవడం టీఆరెస్ కు పెద్ద షాక్ గానే చెప్పవచ్చు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆరెస్ గెలిచినప్పటికీ కూడా కేవలం ఈ నాలుగు నెలల్లోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏర్పడింది. 

ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పార్టీ ఫిరాయింపుల గురించి. గతసారి కొంతమందిని టీఆరెస్ లోకి ఆహ్వానించారు అంటే పూర్తి స్థాయి మెజారిటీ లేదు కాబట్టి అని భావించినప్పటికీ ఈ సారి దాదాపుగా 90 సీట్లు గెలిచాక సైతం CLP విలీన ప్రయత్నాలు తదితర చర్యలను ప్రజలు ఒక రకంగా ప్రశ్నించే గొంతుకలను నొక్కడంలాగానే భావించారు. 

మొత్తానికి ఇప్పటికైనా టీఆరెస్ పార్టీ మేల్కొనకపోతే మాత్రం మున్ముందు కాలంలో మరింత వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చు.