గుడికి వచ్చే ఓ  వివాహితపై పూజారి వేధింపులకు దిగిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి పూజలు చేస్తానని చెప్పి భారీ మొత్తంలో మహిళ నుండి  డబ్బులు వసూలు చేశాడు. అయితే ఆ సమస్యను పరిష్కరించకపోగా మరో సమస్యను సృష్టించాడు. 

ఈ వేధింపులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన అదర్వ అవదాని(34) మిర్జాల్‌గూడలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్యోదిగి మహిళ(50)కు మతిస్థిమితంలేని  కొడుకు(12) తో పాటు పీజీ చదువుతున్న కూతురు ఉంది.

అయితే కొడుకు పరిస్థితి  మెరుగవ్వాలని మహిళ నిత్యం సిద్దివినాయక ఆలయానికి వెళ్లి పూజలు చేసేది. దీన్ని అదునుగా తీసుకుని పూజారి అవదాని ప్రత్యేక పూజలు చేసి బాలుడి పరిస్థితిని మెరుగుపరుస్తానని నమ్మించి మహిళ నుండి రూ.60 వేలు తీసుకున్నాడు. అయితే ఎన్ని రోజులు గడుస్తున్నా బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగుపడక పోవడంతో సదరు మహిళ పూజారిని నిలదీసింది.

దీంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్న పూజారి ఆమెకు సహచర ఉద్యోగితో అక్రమ సంబంధం ఉందని భర్తకు మెసేజ్ చేశాడు. దీంతో సదరు మహిళ తనను పూజల పేరుతో మోసం చేయడమే కాకుండా అక్రమ సంబంధాలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేస్లున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని అదర్వ అవదాని ని అదుపులోకి తీసుకున్నారు.