కరీంనగర్: కరీంనగర్ శివారులోని అలుగునూరు వద్ద కాకతీయ కెనాల్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ సోదరి కుటుంబ సభ్యులు కారులో శవాలై తేలిన ఘటన కొత్త మలుపు తీసుకుంది. కాకతీయ కెనాల్ లో బయటపడిన ఓ కారులో కుళ్లిన స్థితిలో శవాలు కనిపించిన విషయం తెలిసిందే. ఆ శవాలు దాసరి మనోహర్ సోదరి రాధిక, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, వారి కూతురు సహస్రవిగా గుర్తించారు. 

కారు కాలువలో పడిన 15 రోజుల తర్వాత సంఘటన వెలుగులోకి వచ్చింది. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. ఈ సంఘటన ప్రస్తుతం కొత్త మలుపు తీసుకుంది. సత్యనారాయణ రెడ్డి ఫెర్టిలైజర్ షాపులో పోలీసులకు ఓ డైరీ దొరికింది. ఆ డైరీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాకతీయ కెనాల్ లో కారు... కుళ్లిన స్థితిలో ఎమ్మెల్యే సోదరి, ఆమె భర్త, కూతురు

డైరీలో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఆస్తిని తిరుపతి దేవస్థానానికి ఇవ్వాలని సత్యనారాయణ రెడ్డి డైరీలో రాసినట్లు తెలుస్తోంది. డైరీలో అలా రాయడం వల్ల సత్యనారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. 

మృత్యువాత పడినట్లు తేలిన రోజునాటికి దాదాపు 20 రోజుల పాటు వారి జాడ కనిపించలేదని సమాచారం. అయినప్పటికీ ఎవరూ వారి గురించి పట్టించుకోలేదు. దాంతో వారి మృతిపై అనుమానాలు తలెత్తుతూ వచ్చాయి. కారు ప్రమాదవశాత్తు కాలువలో పడిందని భావిస్తూ వచ్చారు. అయితే, తాజాగా డైరీ లభ్యం కావడంతో వారి మృత్యువు మిస్టరీ వీడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

Also Read: సోదరి రాధిక ఫ్యామిలీ మృతి: అదృశ్యంపై ఎమ్మెల్యేకు ముందే తెలిసినా... అనుమానాలు