నిజామాబాద్ జిల్లా నాగారంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు శవాలై తేలారు. మట్టి కోసం తవ్విన నీటి కుంటలో పడి చిన్నారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా... శనివారం ఉదయం వారి మృతదేహాలను వెలికి తీశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... నాగారం ఏజీ క్వార్టర్స్ వద్ద గల ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుతున్న మహమ్మద్ అజార్, సలీం, ఆర్బాజ్ ఖాన్‌లు నిన్న నమాజ్‌కని వెళ్లి కనిపించకుండా పోయారు.
 
స్కూల్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఎంత వెదికినా కనిపించకపోవడంతో ఐదో టౌన్ పొలీస్ స్టేషన్‌లో చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన వారిలో ఒకరు మూడో తరగతి, ఇద్దరు నాలుగవ తరగతి చదువుతున్నారు. వర్షాలకు నిండిన కుంటను సరదాగా చూసేందుకో, స్నానానికో వెళ్లి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ఉదయం స్కూల్ కి అని చెప్పి వెళ్లిన చిన్నారులు ఇలా శవమై తేలడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.