జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే విధుల్లో చేరుతామంటూ ప్రభుత్వానికి తెలియజేశారు. తరువాత ప్రభుత్వంతో సామరస్యంగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు.
తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కొంత కాలంగా సమ్మె బాట పట్టిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ నిరసనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే విధుల్లో చేరుతామంటూ చెప్పారు. వెంటనే విధుల్లో చేరాలని, లేకపోతే విధుల నుంచి తొలగిస్తామని, కొత్త వారిని కాంట్రాక్ట్ ప్రాతిపాదికన జేపీఎస్ లు గా తీసుకుంటామని శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. కొత్త అభ్యర్థుల నియామకాల కోసం నిబంధనలు కూడా రూపొందించింది. వారికి సోమవారం నియామక పత్రాలు అందజేస్తామంటూ కూడా తేల్చి చెప్పింది.
`సీఎం కప్ -2023 @ రూ. 3.60 కోట్లు.. లోగో, మస్కట్ లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
డిగ్రీ పూర్తి చేసి, స్థానికంగా ఉంటూ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి, అలాగే గతంలో పంచాయతీ సెక్రటరీ పరీక్ష రాసిన వారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాల వల్ల పంచాయతీ సెక్రటరీలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్ వినే స్థితిలో ఇప్పుడు లేదని అర్థం చేసుకున్న జేపీఎస్ లు సమ్మెను ఆపేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికైతే విధుల్లో చేరతామని, తరువాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని జూనియర్ పంచాయతీ సంఘం నాయకులు చెబుతున్నారు. తమ సమస్యలను సామరస్యంగా ప్రభుత్వానికి విన్నవిస్తామని పేర్కొన్నారు.
"ప్రజలే భవిష్యత్తును నిర్ణయిస్తారు..": రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
కాగా.. జూనియర్ పంచాయతీలు చేస్తున్న సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. వారి సమ్మెను ఉక్కుపాదంతో ఆపేందుకు బీఆర్ఎస్ సర్కార్ కుట్ర పన్నుతోందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. వారి న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదని చెప్పారు. ఐదు నెలల తరువాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు జేపీఎస్ లను ఉద్యోగాల్లోకి తీసుకొని, పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తామని, సమ్మె కొనసాగించాలని సూచించారు. కానీ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మెను అర్ధాంతరంగా వదిలేశారు.
