Asianet News TeluguAsianet News Telugu

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. టిక్కెట్స్ ఇచ్చేందుకు కండక్టర్ సర్కస్ ఫీట్లు.. వీడియో వైరల్

మహాలక్ష్మీ పథకం (mahalaxmi scheme) ద్వారా తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సులన్నీ రద్దీగా మారాయి. దీంతో కండక్టర్లు టిక్కెట్ జారీ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే టిక్కెట్లు ఇచ్చేందుకు ఓ బస్సు కండక్టర్ చేసిన సర్కస్ ఫీట్లు (Conductor circus feats) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Videos viral)గా మారాయి.

The impact of the Mahalaxmi scheme. Conductor circus feats to give tickets. Video goes viral..ISR
Author
First Published Feb 21, 2024, 7:14 AM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం వల్ల టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని మహిళలు తెలంగాణలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనిని చాలా మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఆర్టీసీకి ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఇందులో అధిక శాతం మహిళలే ఉంటున్నారు. దీంతో చాలా సందర్భాల్లో మగవాళ్లు నిలబడే ప్రయాణిస్తున్నారు. కొన్ని సార్లు అయితే నిలబడేందుకు కూడా స్థలం సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

బస్సులు రద్దీగా ప్రయాణిస్తుండటంతో మహిళలకు కూడా సీట్లు దొరకడం లేదు. దీంతో పలు సందర్భాల్లో మహిళల మధ్య గొడవలు వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వీడియోలు బయటకువ వచ్చాయి. కాగా.. మహాలక్ష్మీ పథకం వల్ల బస్సులన్నీ జనంతో నిండిపోతుండంతో ఆర్టీసీ సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. 

బస్సులు రద్దీగా మారుతుండంతో డ్రైవర్లు బస్సు నడపడానికి, కండక్టర్లు టిక్కెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అందుబాటులో ఉన్నప్పటికీ.. వారికి కచ్చితంగా జీరో టిక్కెట్ జారీ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే టీఎస్ ఆర్టీసీకీ ప్రభుత్వం రియంబర్స్ మెంట్ చెల్లిస్తుంది. దీంతో కిక్కిరిసిపోయిన బస్సులో కండక్టర్లు అటు నుంచి ఇటు నడుస్తూ టిక్కెట్లు తీయడానికి నానా అవస్థలు పడుతున్నారు. 

బస్సులో అధికంగా మహిళలే ఉంటుండంతో వారిని తోసుకుంటూ ముందుకు, వెనక్కి వెళ్తూ టిక్కెట్లు జారీ చేయడం కండక్టర్లకు కష్టంగా మారింది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ కండక్టర్ బస్సు వెనక్కి వెళ్లి టిక్కెట్లు ఇచ్చేందుకు సర్కస్ ఫీట్లు చేశారు. బస్సుల్లోని సీట్లపై కాళ్లు పెడుతూ, తల బస్సు రూప్ కు తాకకుండా, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెనక్కి వెళ్లారు. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందన్న విషయం తెలియడం లేదు గానీ.. కండక్టర్ అవస్థలు చూసి అందులో ఉన్న మహిళా ప్రయాణికులు జాలి పడ్డారు. 

టిక్కెట్లు ఇచ్చేందుకు కండక్టర్ చేస్తున్న స్టంట్స్ ను అందులో ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలు వీడియో తీశారు. అందులో కండక్టర్.. రిస్క్ చేస్తూ, ఎంతో జాగ్రత్తగా సీట్లపై కాళ్లు పెడుతూ బస్సు వెనక్కి వెళ్తున్నారు. దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios