హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేంద్రమాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్న వారంతా యాచకులు అంటూ ధ్వజమెత్తారు. 

గాంధీభవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందన సభలో పాల్గొన్న ఆయన పార్టీ ఫిరాయింపులు సరికాదన్నారు. పార్టీ ఫిరాయించిన వారు బిచ్చగాళ్లతో సమానం అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 

వారిని ప్రజల మధ్యలో అవమానించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇకపోతే లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ నమోదైందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని జైపాల్ రెడ్డి కోరారు.