బస్సులో మహిళకు టికెట్ ఇచ్చిన కండక్టర్.. విచారణకు ఆదేశించిన టీఎస్ ఆర్టీసీ
నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్లే ఓ టీఎస్ ఆర్టీసీ బస్సులో కండక్టర్ మహిళకు టిక్కెట్ జారీ చేయడం వివాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ విచారణకు ఆదేశించింది.
తెలంగాణ వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద తెలంగాణ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఓ కండక్టర్ ఆమెకు రూ.90 టిక్కెట్టు జారీ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీఎస్ ఆర్టీసీ దీనిపై విచారణ జరిపేందుకు సిద్ధమైంది.
అసలేం జరిగింది..
టీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ కు వెళ్తోంది. అందులో ఓ మహిళ బస్సులో ఎక్కింది. అయితే ఉచితం ప్రయాణం ఉన్నప్పటికీ కండక్టర్ ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. రూ.90 టిక్కెట్ జారీ చేశారు. టిక్కెట్ ఎందుకు ఇచ్చారని, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ వీడియో తీశాడు. అయితే దానికి కండక్టర్ నిరాకరించారు. అయితే ఆ వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉచిత బస్సు ప్రయాణం ఉన్నప్పటికీ ఓ మహిళకు కండక్టర్ రూ.90 టిక్కెట్ ఇచ్చారని, ఈ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తోందని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
అందులో ‘‘నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక మహిళకు టికెట్ జారీ చేసిన ఘటనపై విచారణకు ఆదేశించాం. సంబంధిత కండక్టర్ ను డిపో స్పేర్ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది.’’ అని పేర్కొన్నారు.