TG20 League: తెలంగాణలో క్రికెట్ ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ 2026 ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 

ఉప్పల్ స్టేడియంలో అద్భుత ప్రారంభోత్సవ వేడుక

టీజీ20 లీగ్ తొలి సీజన్ ప్రారంభోత్సవం ప్రేక్షకులను అలరించింది. హెచ్‌సీఏ ప్రతినిధులు, లీగ్‌లో పోటీ పడుతున్న ఎనిమిది ఫ్రాంఛైజీల యజమానులు, కెప్టెన్లు, ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సంగీత దర్శకుడు ఎస్. థమన్ తన ప్రత్యేక సంగీత కార్యక్రమంతో స్టేడియాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. అనంతరం నిర్వహించిన లేజర్ షో, బాణాసంచా ప్రదర్శనలు వేడుకలకు మరింత అందం చేకూర్చాయి.

బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ సందడి

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కార్యక్రమంలో పాల్గొని యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం అందించారు. తెలంగాణ నుంచి ప్రపంచ క్రికెట్ ప్లాట్ ఫామ్ లపై గుర్తింపు పొందిన ఆటగాళ్ల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత తెలంగాణ నుంచి మ‌రికొంత మంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు రావాలని ఆకాంక్షించిన విజయ్, టీజీ20 లీగ్ ఆ లక్ష్యాన్ని నెరవేర్చగల ప్లాట్ ఫామ్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ లీగ్ ద్వారా ఐపీఎల్‌తో పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే కొత్త తరం ఆటగాళ్లు ఎదగాలని కోరుకున్నారు.

ప్రభుత్వం నుంచి పూర్తి మద్ధతు: భట్టి విక్రమార్క

ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువతకు సరైన అవకాశాలు అందించడం అత్యంత అవసరం అని ఆయన పేర్కొన్నారు. టీజీ20 లీగ్ అలాంటి యువ క్రీడాకారులకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అద్భుత ప్లాట్ ఫామ్ గా నిలుస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతోందని, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

తొలి మ్యాచ్‌తో టోర్నీకి శ్రీకారం

ప్రారంభోత్సవ వేడుకల అనంతరం టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌కు తెరలేచింది. పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తొలి పోరులో తలపడ్డాయి. టీజీ20 లీగ్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ విజయం సాధించింది. పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలిచింది. రాబోయే రోజుల్లో వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ లీగ్‌లో హైదరాబాద్ ఛాంపియన్స్ సహా పలు జట్లు పాల్గొంటున్నాయి. యువ ఆటగాళ్లకు ప్రత్యక్షంగా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని ఈ టోర్నీ కల్పించనుంది. స్కౌట్స్, ఫ్రాంఛైజీలు, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఇది కీలకంగా మారనుంది.

‘ఇక మన ఆట షురూ’.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంథమ్

టీజీ20 లీగ్ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన అధికారిక యాంథమ్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ‘ఇక మన ఆట షురూ’ అనే నినాదంతో రూపొందించిన ఈ పాటను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ యాంథమ్ తెలంగాణ యువతలో క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, టోర్నీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి రావాలనే సందేశాన్ని ఈ ప్రచార కార్యక్రమాలు బలంగా చాటుతున్నాయి.