తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి, యాకత్ పురా ప్రాంతంలో రిగ్గింగ్ కు పాల్పడుతున్నారన్న  అనుమానంతో ఎంఐఎం, ఎంబీటి పార్టీ కార్యకర్తల పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పోలింగ్ స్టేషన్ల వద్దే కాకుండా కాలనీల్లో పర్యటించి అల్లర్లకు కారణమైన వారిని గుర్తించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే ఖైరతాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో చెదురు మదురుగా కొన్ని ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పై బిజెపి నాయకులు దాడికి పాల్పడగా ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. ఇలా చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మరికొందరు నాయకులు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ ఈసికి పిర్యాదులందాయి. మంథని ఎమ్మెల్యే పుట్టా మధుతో పాటు ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఈసికి, పోలీసులకు చాలా ఫిర్యాదులు అందాయి.

ఇవాళఈ ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల  కల్లా తెలంగాణలో 17 శాతం ఓట్లు పోలయ్యాయి.  అయితే మధ్యాహ్నానికి ఓటింగ్ శాతం పుంజుకుని 49.15 శాతంగా నమోదయ్యింది. మద్యాహ్నం 3 గంటల వరకు 56.17 శాతం ఓట్లు పోలయ్యాయి.