హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ షర్మిల ఈరోజు ఉస్మానియా ఆస్పత్రి సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వైఎస్ షర్మిల ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లకుండా చూసేందుకు ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే వైఎస్ షర్మిల ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆమెను బయటకు రాకుండా అడ్డుకున్నారు. 

ఈ క్రమంలోనే పోలీసులు, వైఎస్సార్‌టీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అయితే ఈ తోపులాటలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు. దీంతో వైఎస్ షర్మిల నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు.. వైఎస్సార్‌టీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరిస్తున్నారు. ఇక, ఈ సందర్భంగా పోలీసుల తీరును వైఎస్ షర్మిల తప్పుపట్టారు. పోలీసులు కేసీఆర్ తొత్తులుగా మారి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

‘‘నా ఇంటి బయట భారీగా పోలీసుల మోహరింపు! ఎందుకు ??? కేసీఆర్‌ను అడగాలనుకుంటున్నాను.. మీరు నన్ను ఏం చేస్తారు?. ఇది మీ భయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేసీఆర్.. మీరు నన్ను ఆపలేరు. నా గొంతుకను మూయలేరు. నేను ప్రజల గొంతును. నన్ను చంపగలవు కానీ.. మౌనంగా ఉంచలేవు’’ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.