హైద్రాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత: అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత
తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేయడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పు బట్టారు. ఇవాళ ఎంజె మార్కెట్ వద్ద అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: హైద్రాబాద్ ఎంజె మార్కెట్ వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ అడ్డుకున్నారు. కేసీఆర్ పై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. హిమంత బిశ్వశర్మ ప్రసంగానికి నందూ బిలాల్ అడ్డు చెప్పారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకంది. టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ ను పోలీసులు అక్కడి నుండి తరలించారు.
హైద్రాబాద్ లో ఇవాళ జరుగుతున్న వినాయక విగ్రహల నిమజ్జనం కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు.ఎంజే మార్కెట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్నారు. ఈ సమయంలో హిమంత బిశ్వ శర్మ తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పై విమర్శలను టీఆర్ఎస్ నేత బిలాల్ సహించలేకపోయారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రసంగాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.
also read:తెలంగాణలో నయా నిజాం పాలనను అంతం చేస్తాం: అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
వేదికపైకి చేరుకొని అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు.ఈ సమయంలో సీఎం భద్రతా సిబ్బంది నిలువరించారు. ఈ సమయంలో బీజేపీ నేతలకు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ ను పోలీసులు ఎంజె మార్కెట్ నుండి తీసుకొని వెళ్లిపోయారు. వేదికపైకి ఎవరు వస్తున్నారో ఎవరూ వస్తున్నారో పట్టించుకోకపోతే ఎలా అని అసోం సీఎం భద్రతా సిబ్బంది హైద్రాబాద్ పోలీసులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరగడానికి ముందు ఇదే ప్రాంతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులకు గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు మధ్య ప్లెక్సీ విషయమై స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ సమయంలో నందూ బిలాల్ అక్కడే ఉన్నారు.ఈ విషయమై ఇరు వర్గాలు తీవ్రంగా వాదులాడుకున్నారు. ఈ వాదులాట పూర్తయ్యేసరికి అసోం సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పై హిమంత బిశ్వశర్మ విమర్శలు చేస్తుండడంతో నందూ బిలాల్ హిమంత బిశ్వశర్మ మాట్లాడుతున్న మైక్ ను లాక్కొనే ప్రయత్నం చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితులు చక్కబడ్డాయి.