కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా నేడు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. అయితే ప్రజాదర్భార్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

కామారెడ్డి మున్సిపాలిటీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా నేడు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. అయితే ప్రజాదర్భార్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉందని.. ప్రజాదర్బార్‌కు ఎవరు వచ్చినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు అనుమతి లేదని చెప్పినప్పటికీ.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకన్నారు. అయితే ప్రజాదర్బార్ అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరు ముఖ్య నాయకులతో పాటు, 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా మున్సిపాలిటీ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కామారెడ్డి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

భూకబ్జా, అక్రమాలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. శ్రీవారి వెంచర్‌లో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత వెంకట రమణారెడ్డి ఆరోపించారు. అయితే ఇందుకు టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. రమణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు.. కొద్ది రోజులు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెంకటరమణారెడ్డి మున్సిపాలిటీ వద్ద ప్రజా దర్భార్ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ నేత నిట్టు వేణుగోపాల్ రావు మాట్లాడుతూ.. బీజేపీ కౌన్సిలర్లే అవినీతిపరులని ఆరోపించారు. ఈ క్రమంలోనే పోటాపోటీగా ప్రజా దర్భార్‌కు పిలుపునిచ్చాయి. 

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి.. 
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని.. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీ నిర్వహించడం కుదరదని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని ఇరు పార్టీల నేతలను కోరారు. చట్ట వ్యతిరేకంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.