జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామలో బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేసిన సీఐ సహా ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు జనగామ డీసీపీ కార్యాలయం ముందు ధర్నాకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వివేకానంద జయంతి విషయమై జనగామ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు మంగళవారం నాడు లాఠీ చార్జీ చేశారు. ఈ లాఠీచార్జీలో బీజేపీ నేతలు గాయపడ్డారు. గాయపడినవారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనను నిరసిస్తూ ఇవాళ ఛలో జనగామకు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నాడు జనగామకు చేరుకొన్నారు. జనగామ డీసీపీ కార్యాలయం ముందు ధర్నాకు బీజేపీ ప్రయత్నించింది.

ఈ సమయంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకొంది. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

లాఠీచార్జీ చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సీఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఏం చేస్తామో చెప్పం.. చేసి చూపిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో వివేకానంద జయంతిని ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా అని ఆయన ప్రశ్నించారు.

వివేకానంద జయంతి విషయమై ఫ్లెక్సీల విషయమై కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం తప్పా అని అడిగారు. జనగామ మున్సిపల్ కమిషనర్ పై కూడ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ కార్యాలయం నుండి ప్రభుత్వాసుపత్రి వరకు కార్యకర్తలతో బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  పార్టీ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు.