దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. తాజాగా దుబ్బాక మండలం అప్పనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ - బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

దీంతో పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపు చేశారు. కర్రలతో కొట్టుకుంటూ.. ఒకరికొకరు నెట్టుకుంటూ కార్యకర్తలు అక్కడ బీభత్సం సృష్టించారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ రాజకీయం నడుస్తోంది. గెలుపే ధ్యేయంగా ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఒకరి బలహీనతలపై మరొకరు దాడి చేస్తున్న పరిస్థితి నెలకొంది.

అధికార టీఆర్ఎస్ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ఎస్ బీజేపీ తమ బలాలు ప్రయోగిస్తున్నాయి.

బీజేపీలోని కేంద్రం అండతో రెచ్చిపోతుంటే.. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికార బలంతో సై అంటోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేయడం కలకలం రేపింది. ఇది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారి ఉద్రిక్తతకు దారితీసింది.