ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్న టీడీపీ: ఉద్రిక్తత, అదుపులోకి తీసుకున్న పోలీసులు (వీడియో)
ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఇవాళ ఖమ్మంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఖమ్మం: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కాన్వాయ్ ను శుక్రవారంనాడు ఖమ్మంలో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసుల రంగ ప్రవేశం చేసి టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.
నిన్న రాత్రి ఖమ్మం పట్టణానికి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేరుకున్నారు.ఓ హోటల్ లో అంబటి రాంబాబు బస చేశారు. ఖమ్మం పట్టణంలోని ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను బస చేసిన హోటల్ నుండి ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ బయలు దేరారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నారు.చంద్రబాబు జై అంటూ నినాదాలు చేశారు.అంబటి రాంబాబు కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మంత్రి కాన్వాయ్ కు అడ్డు పడ్డారు. టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్న తర్వాత మంత్రిని ఫంక్షన్ హాల్ కు వరకు బందోబస్తు మధ్య తరలించారు పోలీసులు.టీడీపీ శ్రేణులు మంత్రి అంబటి రాంబాబును అడ్డుకొన్న ఘటనతో ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ శ్రేణులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా: అంబటి
తనపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కర్రలు పట్టుకొని టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆయన చెప్పారు. తనపై దాడి చేయాలనే ఉద్దేశ్యంతో టీడీపీ శ్రేణులు కర్రలతో వచ్చారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.
also read:సీఐడీ అధికారుల కాల్ డేటాపై బాబు పిటిషన్: తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. చంద్రబాబును ఉద్దేశ్యపూర్వకంగా ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని టీడీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడ ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడ స్పందిస్తున్నారు. నిజం గెలవాలని భువనేశ్వరి చేస్తున్న యాత్రపై గతంలో ఆయన సెటైర్లు వేశారు. నిజం గెలిచినందునే చంద్రబాబు అరెస్టయ్యారని ఆయన చెప్పారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ నిర్వహించింది. అయితే వెకేషన్ బెంచ్ జడ్జి జ్యోతిర్మయి ఈ పిటిషన్ పై విచారణ నుండి తప్పుకున్నారు.ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది.