సింగరేణి డిపెండెంట్ యువసేన అధ్యక్షుడి అరెస్టు అందని ఎర్రబెల్లి రాజేష్ ఆచూకి మఫ్టీలో వచ్చి పట్కపోయిర్రని చెబుతున్న కుటుంబసభ్యులు భోజనం చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంపి కవిత పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేసినట్లు అనుమానాలు మరో ఇద్దరి అరెస్టు... ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలని కార్మికుల డిమాండ్

సింగరేణిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ లో సింగరేణి డిపెండెంట్ యువసేన అధ్యక్షుడు, తెలంగాణ జెఎసి సభ్యుడైన ఎర్రబెల్లి రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మఫ్టీలో ఉండి రాజేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.

రామకృష్ణాపూర్ లో తమ ఇంట్లో భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చి ఇంటినుంచి పట్కపోయిర్రని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ఈ విషయం తెలియడంతో సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో రాజేష్ ఇంటికి చేరుకుంటున్నారు. వివరాలు సేకరిస్తున్నారు.

మరోవైపు నిజామాబాద్ ఎంపి కవిత కోల్ బెల్ట్ పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న నేపథ్యంలో ఆమె పర్యటనను అడ్డుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే పోలీసులు ముందస్తు అరెస్టు చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసు వర్గాల నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.

ఇదిలా ఉంటే కొమ్ముల శ్రీనివాస్, ఎర్రోల నరేష్ లను కూడా అరెస్టు చేశారు. అయితే వీరిద్దరి అరెస్టును పోలీసులు ధృవీకరిస్తున్నారని, రాజేష్ అరెస్టుపై ఎలాంటి సమాచారం లేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. వెంటనే అరెస్టు చేసిన ముగ్గురిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కానీ సింగరేణిలో యువకుల అరెస్టు నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.