మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. టికెట్ దొరక్కపోవడంతో కొందరు నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో పలు పార్టీలు వారికి గాలం వేస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్‌కు సమీపంలోని పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీలో మొదలైన ముసలం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మేయర్ టికెట్ అశించిన దర్గా దయాకర్‌ రెడ్డికి హైకమండ్‌ నుంచి నిరాశే ఎదురైంది.

Also Read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికెళ్లి కలిశారు. అంతేకాకుండా అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని మేయర్ పదవికి బీఫాం ఇచ్చినట్లుగా కథనాలు వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన టీఆర్ఎస్ అధిష్టానం మంత్రి మల్లారెడ్డిని ఆఘామేఘాలపై ఆయన వద్దకు పంపింది. దీంతో మల్లారెడ్డి... దయాకర్ రెడ్డిని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోవడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

Also Read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

పీర్జాదిగూడ ప్రాంతలో దయాకర్ రెడ్డికి మంచి పట్టుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడ్చల్‌ నుంచి మల్లారెడ్డి గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే దయాకర్ రెడ్డి పీర్జాజిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకుని, గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.

అయితే ఇందుకు నిరాకరించిన గులాబీ చీఫ్ మరో విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.